కర్ణాటక సంగీతం - శక్తి ఉపాసన (భాగం - 6)

కర్ణాటక సంగీతం - శక్తి ఉపాసన 
(ఆరవ భాగము)

'With great power comes great responsibility' says a character from a comic book.  గొప్ప శక్తి ,పెద్ద బాధ్యత.  అధికారం, శక్తి, హోదా, ఇవన్నీ ఎంత పెద్దవైతే అంత బాధ్యతగా మెలగాలి.  ఒక కళ, ఒక కళాకారుడు, ఎంతో బాధ్యతగా ప్రవర్తిస్తేనే సమాజాన్ని సరైన దారిలో నడిపించగలుగుతారు.  

ఇప్పుడు అది మన తెలుగునాట కరువైంది.  ఒక టీవీ ఛానల్, ఒక రేడియో, ఒక సినిమా, ఒక వెబ్ సిరీస్, ఇవన్నీ మనం తెలియకుండానే ప్రభావం చూపే శక్తులు.  వీటిని నిర్వహించేవారు కేవలం డబ్బు సంపాదనకు మాత్రమే ప్రాధాన్యతని ఇచ్చి 'జనాలు చూసే content' పేరుతొ ఎంతో పనికిరాని కార్యక్రమాల ద్వారా ప్రజల సమయాన్ని వృధా చేస్తున్నారు.  

జనాలు చూస్తున్నారు అన్నది నేను ఒప్పుకోలేను.  నిజమే ఒక్కోసారి views, responses numbers చుస్తే వాటికే ఆదరణ ఎక్కువ ఉందని అనిపిస్తూ ఉంటుంది.  కానీ బాధ్యతగల contentని create చెయ్యకపోడానికి అది కారణం కాదు.  మంచి content లో డబ్బు లేదు అన్నది కూడా నిజం కాదు.  మంచి content create చేయలేకపోవడం కేవలం originality integrity లేకపోవడం వల్ల మాత్రమే జరుగుతుంది.  

మన సంగీత సాహిత్యాలే అందుకు నిదర్శనం.  మన చేతిలో ఒక platform/art ఉన్నప్పుడు ప్రకృతి మనల్ని నమ్మి ఒక బాధ్యత ఇచ్చినట్టే లెక్క. ఈ integrity ని ఎంతో మంది పాటించారు, పాటిస్తున్నారు కూడా.  

ఇదంతా మనల్ని మళ్ళి వాగ్గేయకారుల వ్యక్తిత్వాల దగ్గరకి తీసుకువస్తుంది.  అద్భుతమైన విద్యని ఎంతో బాధ్యతగా తీసుకొని తరతరాలు వారు create చేసిన కళానిధి ద్వారా లాభపడేలా చూశారు.  

రోజుకో త్యాగరాజ స్వామి కృతి పాడితే/వింటే ఆ ఇంట్లో, పాడేవారి/వినేవారి  ఒంట్లో ఉత్పత్తి అయ్యే positive energy, ఆ ఎనర్జీ ద్వారా వారి కుటుంబం, ఇల్లు  జీవితం ఎంత గొప్ప పరిణామానికి గురి అవుతాయో నిదర్శనాలు ఉన్నాయి.  

అలాగే తమ కృతులద్వారా ఎన్నో మంత్ర తంత్రాలను నిక్షిప్తం చేసి గొప్ప ఉపాసనలని అందుబాటులోకి తెచ్చిన ముత్తుస్వామి దీక్షితుల వారి కమలాంబ కృతుల ప్రస్తావన ఇవాళ్టి బ్లాగ్ లో.  


 ఇది మహామహోపాధ్యాయ శ్రీ నూకల చిన్న సత్యనారాయణ గారు వ్రాసిన గ్రంథం.  ఇందులో శ్రీ ముత్తుస్వామి వారి నవగ్రహ కృతులు, నవావరణ కృతులకు అర్థ తాత్పర్యాలు అందించారు వారు.  ఇది శ్రీ కౌతా లలితా మనోహర్ గారు ముద్రింపజేశారు. 


మా సోదరి చిరంజీవి లహరికి వారు ఆప్యాయంగా ఈ గ్రంథాన్ని సంతకం చేసి ఇచ్చారు.  అలా ఈ సంగీత గ్రంథం మా దాకా వచ్చింది.  ఇందులో కేవలం అర్థాలు మాత్రమే కాదు ప్రతి కృతికి నొటేషన్ కూడా అందించారు.  చాలా అమూల్యమైన సంగీత గ్రంథం ఇది.    
  
ఇందులో రోజు దర్శించుకునేందుకు వీలుగా శ్రీ కామేశ్వర కామేశ్వరీ చిత్ర పటం, ఆయుర్వేదరత్న Dr B S V Pandith (Bangalore) వారు వేసిన శ్రీ చక్ర పటం ఉన్నాయి.  

శ్రీ ముత్తుస్వామి వారి సంక్షిప్త జీవిత చరిత్ర కూడా అందించారు, చివరన 
ఈ ప్రార్థన తో ముగించారు.

'కమలాపుర వాసాయ, వేద శాస్త్ర కళాత్మనే 
వాగ్గేయకార రత్నాయ, నమః శ్రీ ముత్తు స్వామినే'

'కమలాంబ' తిరువారూర్ లో వెలసిన అమ్మవారు.  సంగీత త్రిమూర్తులు ఇక్కడే జన్మించారు.  కమలాంబ అమ్మవారి ఆలయంలో శ్రీ చక్రము కూడా ప్రతిష్టింప బడింది.  ఇదే కమలాంబ నవావరణ కృతుల జన్మస్థానం కూడా.  

ఈ కృతులు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఖడ్గమాల స్తోత్రం తెలియాలి.  ఈ స్తోత్రం లో ఈ శ్రీచక్రం యొక్క స్వరూపం, geography, ఒక్కో ఆవరణ కి సంబంధించిన అధిష్ఠాన దేవతల యొక్క నామాలు, అన్ని స్పష్టంగా ఉంటాయి.  

శ్రీ ముత్తుస్వామి దీక్షితులవారి కృతులు ఎన్నో layers తో నిండి ఉంటాయి.  అంటే ఎన్నో aspects ఉంటాయి వారి రచనలలో.  వ్యాకరణం, మంత్ర శాస్త్రం, సంగీత శాస్త్రం, ఇవన్నీ భక్తి అనే భావనతో అనుసంధానం చేసి సృష్టించారు వారి కృతులని.  ఎన్ని చదువులు చదివినా greater power/దైవ స్పృహ  లేకపోతే దానికి పూర్ణత ఉండదు.  అందుకే ఎన్ని ప్రక్రియలు చేసినా భక్తి అనేది అంతర్వాహినిగా ప్రవహిస్తూనే ఉంటుంది వాగ్గేయకారుల రచనలలో.  

ఈ నవావరణ కృతులు మొత్తం 11 కృతులు - మొదట ప్రార్థనా కృతి, చివరిది మంగళాశాసనం.  

1 కమలాంబికే - తోడి, రూపకం - ప్రార్థనా కృతి 

పల్లవి 
కమలాంబికే, ఆశ్రితకల్పలతికే, చండికే 
కమనీయారుణాంశుకే, కర విధృతశుకే, మామవ జగదంబికే || 

అనుపల్లవి 
కమలాసనాది పూజిత కమలాపదే, బహువరదే 
కమలాలయ తీర్థ వైభవే, శివే, కరుణార్ణవే || 

చరణం 
సకల లోక నాయికే, సంగీత రసికే, 
సుకవిత్వ ప్రదాయికే, సుందరి, గతమాయికే 
వికళేబర ముక్తిదాన నిపుణే అఘహరణే 
సకలే, గురుగుహ కరణే, సదా శివాంతఃకరణే, 
అకచటపాది వర్ణే, అఖండైక రసపూర్ణే || 

అన్నిటికంటే ముందు - ఏమిటీ కమలము? ఈ పువ్వునే ఎందుకు మళ్ళి మళ్ళి ఆధ్యాత్మిక పరిభాషలో దాదాపు ప్రతి కవి, ప్రతి వాగ్గేయకారుడు ప్రస్తావిస్తారు? 

కమలము, పద్మము దాదాపు ప్రపంచంలో అన్ని మతాల్లోనూ ప్రాధాన్యత ఉన్న పువ్వులు.  దేవీ దేవతల చిత్రీకరణ లో కూడా పద్మంలో/కమలంలో కూర్చున్నట్టు, లేదా మొగ్గలు చేత ధరించినట్టు మనం చూస్తూ ఉంటాము.

దీనికి ఎన్నో కారణాలు చెప్తారు. ఒకటి ఆ కమలము పుట్టిన విధానం - అంటే బురద లోంచి అంత అందంగా సాత్వికంగా పుట్టడం వల్ల కమలానికి అంతటి గౌరవం, ప్రాధాన్యత.

రెండు, ఈ పువ్వులోనే మళ్ళి విత్తనాలు/seeds ఉంటాయి, అంటే మళ్ళి ఉత్పత్తి చెందడానికి సిద్ధంగా ఉన్నది కూడా.

ఈ కమలము మనలోని చక్రాలతో పోలి ఉండటం వల్ల కూడా ఇది ఆధ్యాత్మిక సాధనకు సంకేతంగా వినియోగిస్తారు.

శ్రీ మహావిష్ణువును 'కమలనాభ' అని స్తుతిస్తారు.  దీని వెనుక ఉన్న అర్థం, మహావిష్ణువు మణిపుర చక్రానికి అధిపతి.  solar plexus అంటారు.  ఆ చక్ర బీజాక్షరం రం.  ఆయన చక్రం పూర్తిగా విచ్చుకుని ఉంటుంది కనుక ఆయనకి కమలనాభుడని, పద్మనాభుడని పేరు.  అదే సర్వ సృష్టికి మూలమైన బ్రహ్మ జన్మస్థానము అంటే source of  the creative force అని అర్థం.

అలాగే శ్రీ చక్రము వెయ్యి రేకుల కమలము తో పోలి ఉంటుంది.  అదే మన సహస్రార చక్ర స్వరూపం కూడా. కనుక అమ్మవారిని కమలాంబ అని స్తుతిస్తారు.  ఇటువంటి కమలాంబ అమ్మవారు తిరువారూర్ లో వెలిసి, ఈ నవావరణ కృతులు వ్రాసేందుకు శ్రీ ముత్తుస్వామి దీక్షితుల వారికి ప్రేరణని అందించారు.

ఇది ఈ మొదటి ప్రార్థన కృతి ని పరిశీలిస్తే, ఇతర కృతులలో కనిపించే రాగ ముద్ర ఉండదు.  ముత్తుస్వామి వారు తోడి ని 'జనతోడి' అని వెంకటమఖి గారి రాగ పద్ధతిని అనుసరించేవారు.  ఈ కృతిలో అయితే ఈ రాగం యొక్క ప్రస్తావన నాకైతే కనిపించలేదు.

కానీ కొన్ని మంచి నామాలు మనకి పరిచయం చేశారు అమ్మవారివి - గతమాయికే అంటే మాయ అనేదాన్ని మించినది అని అర్థం. శ్రీ త్యాగరాజ స్వామి వారి దివ్యనామ సంకీర్తన 'గతమోహా శ్రితపాల' గుర్తుకు వస్తుంది - గత మోహ అంటే మొహం ఎవరి వద్దకు చేరి నాశనం అవుతుందో ఆ పరమాత్ముడు అని అర్థం.  అలాగే ఎటువంటి మాయ అయినా మాయమయ్యే మా అమ్మ ఈ కమలాంబ అని ఈ నామానికి అర్థం.

అలాగే అమ్మవారిని అకచటతపాది వర్ణ రూపిణిగా కీర్తించారు.  అక్షర రూపమే కమలాంబ అంటే జ్ఞానము, విద్య కళ ఇవన్నీ అమ్మవారి రూపాలే అని అన్నారు - ఇలా ఎందుకు అంటారు అంటే విద్య, శాస్త్రం, కళ ఇవన్నీ మనకి అబ్బినప్పుడు మనద్వారా అవ్వి హానికరంగా taken for granted కాకుండా ఉండేందుకు ఈ కృతులు remindersగా నిలుస్తాయి.

బహుశా ఈ ప్రార్థనా కృతిని తాను తలపెట్టిన ఈ నవావరణ కృతుల సృష్టి అనే యజ్ఞాన్ని అందరికీ మంచిని చేకూర్చే విధంగా తన ద్వారా ప్రవహించాలని వారి ఉద్దేశ్యం అయి ఉంటుంది.

You are nothing but the Universe expressing itself as you! అని అంటారు.  ఈ విశ్వము తన విజ్ఞానాన్ని మన ద్వారా పలికే పాత్రతను మనం సిద్ధం చేసుకోవాలి అని అంటారు.

ఈ ప్రార్థనా కృతి ఈ భావానికి ప్రతీకగా నిలుస్తుంది.  నవావరణ కృతుల విశ్లేషణ వచ్చే భాగంలో

సుష్మ
సాపాసా   

Comments

gowrahari said…
Thanks for this valuable information madam 🙏