కర్ణాటక సంగీతం - శక్తి ఉపాసన (భాగం - 3)

 కర్ణాటక సంగీతం లో శక్తి ఉపాసన 

మూడవ భాగం  


సంగీత త్రిమూర్తుల రచనలో...
కర్ణాటక సంగీతం లో శక్తి ఉపాసన శ్రీ త్యాగరాజు, శ్రీ ముత్తుస్వామి దీక్షితులు, శ్రీ శ్యామశాస్త్రి గారి రచనలలో ఇంకా అద్భుతంగా ఆవిష్కరింపబడింది.  

సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి వారి కృతులలో ...
ముగ్గురిలోకి పెద్దవారైన శ్రీ త్యాగరాజ స్వామి వారు శ్రీ రామచంద్రమూర్తి ని ఏకేశ్వరోపాసన చేసినా, వారి రచనలలో ఇతర దేవీ దేవతల కృతులు  కనిపిస్తాయి.  

కొన్ని ఉదాహరణలు..
  • చూతాము రారే సుదతులార రంగపతిని (ఆరభి) మొదలగు శ్రీరంగ పంచరత్నాలు
  • కంచి వరదరాజ స్వామి కృతులు 
  • నారదముని కృతులు (నారద పంచరత్న కృతులు)
  • తిరుపతి వెంకటేశ్వర స్వామి కృతులు 
ఇలా ఎన్నో కృతులు మనకి ఇతర దేవీ దేవతల దర్శనం చేసుకొని, తీర్థయాత్రలు చేసినప్పుడు ఆ క్షేత్ర సంబంధిత కృతులు శ్రీ త్యాగరాజ స్వామి వారు చేశారు. 

వారి కృతులలోనే వారి యాత్రా విశేషాలు (itinerary) మనకి స్పష్టం అవుతుంది.  

వారి యాత్ర - కృతుల రచన 
అలా వారు వారి తండ్రి గారి బాల్య స్నేహితులైన ఉపనిషద్బ్రహ్మ గారి పిలుపుపై కంచి వెళ్లారు అక్కడ కామాక్షి అమ్మవారి మీద కృతి రచించారు.

'అనాథరక్షకి శ్రీ కామాక్షి, సుజనాఘమోచని శంకరి, వినాయకుని వలెను బ్రోవవే' అనే మాధ్యమావతి రాగ కృతి ఇందులో 'త్యాగరాజుని హృదయమేలిన మురారి సోదరి' అంటూ అమ్మవారిని సంబోధిస్తూ, తన రామ ఉపాసనని తెలియజేశారు. 

తిరువత్తియూర్ పంచరత్నాలు 
అక్కడి నుంచి వారు వాలాజీపేట, తిరుమల, శోలింఘార్ శ్రీ లక్ష్మి నృసింహ దేవస్థానం, చెన్నై నుంచి వారి శిష్యుని గ్రామం అయిన తిరువత్తియూర్ కి వెళ్లారు - అది చాలా గొప్ప క్షేత్రం.  అక్కడ అమ్మవారిని ఉద్దేశించి పంచరత్నాలు రచించారు.  

  • త్రిపుర సుందరి నీ దివ్య రూపమునుజూడ తనకు దొరకెనమ్మ - కళ్యాణి 
  •  త్రిపుర సుందరి నన్నిందరిలోజూచి బ్రోవవమ్మా - బేగడ 
  • త్రిపుర సుందరిని తెలుసుకొంటి - శుద్ధసావేరి 
  • సుందరి నిన్ను వర్ణింప బ్రహ్మాదులకైన తరమా - ఆరభి 
  • కన్నతల్లి నీవు నా పాలిగలుగ గాసిజెంద నేలనమ్మా - సావేరి 
అక్కడి నుండి కొవ్వూరు వెళ్లారు.  కొవ్వూరు సౌందర్యనాయకి సమేత సుందరేశ్వరుని పై పంచరత్నాలు రచించారు.  

లాల్గుడి పంచరత్నాలు 
అక్కడి నుంచి శిష్యుని అభ్యర్థనపై లాల్గుడి వెళ్లారు.  లాల్గుడి పంచరత్నాలు రచించారు అక్కడ వెలిసిన అమ్మవారు 'శ్రీమతి' అమ్మవారి పై వారు రచించిన భైరవ రాగ కృతి 'లలితే శ్రీ ప్రవృద్ధే శ్రీమతి లావణ్య నిధిమతి' - 
ఈ కృతిలో 'కన్నతల్లి శుభవదనే మీ అన్న దయకు పాత్రుడనే - తిన్నగ శరణుజొచ్చితినే - త్యాగరాజ మానస సదనే' అంటూ తమ ముద్రని, రామసేవకుడిని అన్న విషయాన్నీ అమ్మవారికి తెలియజేశారు. 

అలాగే మహిత ప్రవృద్ధ శ్రీమతి గుహ గణపతి జనని అంటూ కాంభోజి లో మరో కృతి రచించారు.  ఇందులో అమ్మవారిని 'త్యాగరాజ భాగ్యదాయిని' అంటూ సంబోధించారు.  లాల్గుడి నే తపస్తీర్థం అని అంటారు.  అమ్మవారి పేరు ప్రవృద్ధ శ్రీమతి.  

అలాగే ఈ లాల్గుడి పంచరత్నాలలోనిదే మరో కృతి 'గతి నీవని కోరివచ్చితి తల్లి, పరాకా - మతిని ఎంతో వెదికి సమ్మతిని శ్రీ ప్రవృద్ధ శ్రీమతి నీ పాదయుగళమునే  నెరనమ్మితిని బ్రోవుమిక' అనే తోడి రాగ కృతిని కూడా రచించారు.  

కమలాపురం - సంగీతత్రయము  
ఇక త్యాగరాజ స్వామి జన్మస్థలమైన తిరువారూర్ కి 'కమల' అనే నామం కూడా ఉంది (కమలాంబ అమ్మవారు, శ్రీ త్యాగరాజ స్వామి వెలిశారు (ఈ శివ స్వరూప నామమే వారికి పెట్టారు).  ఈ చోటే సంగీత త్రిమూర్తులు జన్మించినది.  (కమలాంబ కృతులు శ్రీ ముత్తుస్వామి దీక్షితార్ ఈ అమ్మవారి పైన వ్రాసినవే వచ్చే భాగంలో మరిన్ని వివరాలు)  


ధర్మసంవర్ధని అమ్మవారి కృతులు 
అయితే చిన్నతనంలోనే వారు తిరువయ్యుర్ లేదా పంచనద క్షేత్రం కి వెళ్లిపోయారు.  అక్కడి పంచనాదీశ్వర స్వామి పై కూడా పంచరత్నాలు రచించారు శ్రీ త్యాగరాజస్వామి.  ఆ క్షేత్రవాసిని అయిన ధర్మసంవర్ధినీ దేవి మీద 9 కృతులు రచించారు త్యాగయ్య.  

  • బాల, బాలేందుభూషణి - భవరోగశమని, ఫాలలోచని శ్రీ ధర్మసంవర్ధని సకలలోక జనని - రీతిగౌళ 
  • అమ్మ, ధర్మసంవర్ధని ఆదుకోవమ్మా - అఠాణ 
  • విధిశక్రాదులకు (బ్రహ్మ ఇంద్రులకు) దొరకునా ఇటువంటి సన్నిధి వేడుక చుతాము రారే - యమునా కళ్యాణి (యమన్ కళ్యాణి)
  • శివే పాహిమాం అంబికే - శ్రిత ఫలదాయికే - కళ్యాణి - (ఈ కృతిలో ఒక మణిప్రవాళ రచనా ప్రక్రియ కనిపిస్తుంది, ఇది త్యాగరాజస్వామి రచనలలో అరుదు - పల్లవి కొన్ని చరణాలు సంస్కృతం లో ఉంటాయి, మొదటి చరణం తెలుగులో ఉంటుంది)  ఇందులోనే ఇంకో సంబోధన - కావేర జోత్తర తీర వాసిని అంటారు (కావేరి నది ఉత్తరాన నివసించు ధర్మసంవర్ధని అని అర్ధం) 
  • కరుణజూడమ్మా కామాలవైరి కళాధరుని కొమ్మ - తోడి (కామాలవైరి అంటే చంద్రుడు - చంద్రకళను ధరించినవాడు అయిన శివుని అర్ధాంగి)
  • ననుగన్న తల్లి నా భాగ్యమా, నారాయణి ధర్మంబికే  - సిందుకన్నడ
  • పరాశక్తి మనుపరాద నాపై పరాకేలనమ్మా - పురాణి ధర్మసంవర్ధనీ శ్రీపురారీశ్వరీ రాజశేఖరి - సావేరి 
  • నీవు బ్రోవవలెనమ్మ నను నిఖిల నిఖిలలోక జననీ - దేవి శ్రీ ధర్మసంవర్ధని - దివ్య దర్శనమొసగి సంతతము - సావేరి (రెండు కృతులు సావేరిలో రచించారు - ఒకే రాగాన్ని ఒకే భావానికి, ఒకే దేవతకి రచించడం త్యాగరాజ స్వామి వారి ప్రత్యేకత - రాముని పై కూడా ఇలాగే రచనలు ఉన్నా అందులోనే వైవిధ్యం చూపడం వారి రచనశక్తి కి నిదర్శనం) 
  • అంబా నిను నమ్మితి నీకనుమనమేమమ్మా - ఆరభి - ఈ కృతి చివరి చరణంలో శర్మదాయకి (సుఖములనిచ్చుదాన), గౌరీ, దుష్కర్మ కలుషవన కుఠారి - అని అంటారు చెడుకర్మలు కలుషితం చేసిన కలుపు/అడవిని నరికే గొడ్డలి వంటి దానవు అని అర్ధం. 
కాయరోహణ నీలాయతాక్షి క్షేత్రం - నాగపట్టణ దర్శనం 

అలాగే నాగపట్టణం లో వెలసిన నీలాయతాక్షి అమ్మవారిపై రచనలు చేశారు 
  • ఎవరు తెలియగబోయేరు నీ మహిమల, భువిలో వరమౌ నాగపురమున కనుగొంటి లవలేశమైనను నీలాయతాక్షి సామర్ధ్యము - తోడి 
  • కర్మమే బలవంతమాయ తల్లి - కాయారోహణ జాయ - సావేరి (నాగపట్నం లో వెలిసిన శివుని పేరు కాయరోహణేశ్వర స్వామి - 3వ శతాబ్దం లో సత్ చిత్ ఘనేశ్వరులనే గొప్ప జ్ఞాని ఇలా శివ స్వరూపంగా మారి, దేహంతోనే మోక్షం (ఆరోహణ) పొందారు కాబట్టి ఆ పేరు వచ్చినట్టు మనకి తెలుస్తుంది).

అమ్మవారి కృతుల విశ్లేషణ  
శ్రీ త్యాగరాజ స్వామి రచించిన అమ్మవారి కృతులలో క్షేత్ర సంబంధిత సంబోధన మాత్రమే మనకి కనిపిస్తుంది.  అమ్మవారి సేవలలో పాల్గొని పునీతుడిని అయ్యాను అనే భావన, శరణాగతి, స్తుతి ఇవి ఈ రచనలలో మనకి కనిపించే భావాలు.  

స్వామి వారి కృతులు మనకి ఆ క్షేత్ర దర్శనాన్ని కలిగిస్తాయి.  వివిధ తాళగతులలో సాగే అమ్మవారి కృతుల రచన వారి వాగ్గేయకార వైభవాన్ని తెలియజేస్తుంది.  వారికి అంతా సంగీతమయమే కాబట్టి musical 'travel journal' చేశారు వారు.  

ఇవి శ్రీ త్యాగరాజ స్వామి వారు కర్ణాటక సంగీతానికి అందించిన శక్తి ఉపాసనా కృతి రత్నాలు.  

వచ్చే భాగం లో మరిన్ని విశేషాలు ...

(సశేషం)
సా పా సా 
సుష్మ      


Comments