సంగీత త్రిమూర్తుల కామాక్షి కృతులు - comparative study

కర్ణాటక సంగీతం - శక్తి ఉపాసన SERIES  

సంగీత త్రిమూర్తులు 

కర్ణాటక సంగీతం లో శక్తి ఉపాసన గురించిన ప్రస్తావన నడుస్తోంది సాపాసా బ్లాగ్ లో.  ఇందులో భాగంగా శ్రీ ముద్దుస్వామి దీక్షితుల వారి 'నవావరణ కృతుల' గురించి చర్చించుకొనే ముందు, సంగీత త్రిమూర్తులైన శ్రీ త్యాగరాజు, శ్రీ శ్యామశాస్త్రి, శ్రీ ముద్దుస్వామి దీక్షితుల రచనలలో అమ్మవారి కృతులు, రచనా శైలుల విశ్లేషణ ఈ బ్లాగ్ లో.  

త్రిమూర్తుల కామాక్షి కృతులు - comparative study  
ముగ్గురు అద్భుతమైన కారణ జన్ములు - ఒకే కర్ణాటక సంగీతం - విభిన్నమైన శైలి.  కామాక్షి అమ్మవారి మీద ఈ ముగ్గురు రచించిన కృతులను పోలుస్తూ, ఇంకా వారి style గురించి తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం. 

త్రిమూర్తులు ముగ్గురిలో ఒక పోలిక - వారు యాత్రల్లో దర్శించుకున్న ఆలయాలు, క్షేత్రాల దేవీ దేవతలపై అద్భుతమైన కృతులు రచించడం.  ముగ్గురి రచనల్లో కామాక్షి అమ్మవారి కృతులు తీసుకొని ఇక్కడ మనం పరిశీలిద్దాము.  

శ్రీ త్యాగరాజ స్వామి వారి కంచి కామాక్షి కృతి మాధ్యమావతి రాగం - 
పల్లవి అనుపల్లవి 
వినాయకుని వలెను బ్రోవవే నిను వినా వేల్పురెవరమ్మా 
అనాథరక్షకి శ్రీ కామాక్షి సుజనాఘమోచని శంకరి జనని 


శ్యామశాస్త్రి వారి కామాక్షి స్వరజతి  -భైరవి రాగం  
పల్లవి  
కామాక్షి అనుదినము మరువక నే 
నీ పాదములే దిక్కనుచు నమ్మితిని 
(శ్రీ కంచి) 

శ్రీ ముత్తుస్వామి దీక్షితుల కామాక్షి కృతి  సుమద్యుతి రాగం 
కామాక్షి కామకోటి పీఠ వాసిని మామవ 
కౌమారి కుసుమద్యుతి హేమాభారణ భూషణి 
(మాధ్యమకాల సాహిత్యం) 
సమస్త సామ్రాజ్యదాయిని సద్గురుగుహ జనని 
  
పల్లవుల విశ్లేషణ 
పల్లవులని అనుపల్లవులని పోలిస్తే, శ్రీ త్యాగరాజ స్వామి ఎంతో creative గా 'వినాయకుని వలెను బ్రోవవే' అన్నారు - నీ సొంత బిడ్డలా నన్ను ఆదరించు అని ఎంత అందంగా కూర్చారో కదా - అదే త్యాగరాజ స్వామి రచనా వైశిష్ట్యం.

అలాగే అనుపల్లవి లో 'సుజనాఘమోచని' అనే పదము వాడారు. అంటే మంచి వారు చేసిన పాపాలనుంచి/మంచివారిని పాపలనుంచి మోక్షం ప్రసాదించే అమ్మవి అని అంటారు - ఇక్కడ clear గా మనుషుల్లో మంచివారు చెడ్డవారు ఉంటారనే వారి ఉద్దేశ్యాన్ని, అలాంటివారికే అమ్మవారి ఆదరణ లభిస్తుందనే నమ్మకం తెలియజేశారు త్యాగరాజస్వామి. 

ఇక శ్యామశాస్త్రుల వారి పల్లవి చుస్తే ఎంతో సరళంగా తాను చేసే పూజల గురించి స్పష్టంగా చెప్పేసినట్టు ఉంది.  ఓ కంచి కామాక్షి, ప్రతిరోజూ నియమం తప్పకుండ నీ పాదసేవ చేసుకునేవాడిని అని చెప్పేశారు శ్యామశాస్త్రి వారు.  

సాధారణంగా స్వరజతులకు అనుపల్లవి ఉంటుంది. 
ఉదాహరణకి 
1.సాంబశివా యనవే రజిత గిరి అనే స్వరజాతికి శాంభవి మనోహర పరాత్పర కృపాకర, 
2. రార వేణుగోపబాల అనే స్వరజాతికి సరసాక్ష నేరమేమి మారుబారికోర్వలేరా  
3.బాలకృష్ణ మోహన పరమభక్త పాలనా అనే స్వరజాతికి నందగోపసుకుమార నళినదళాయతాక్ష హరి 

అనేవి అనుపల్లవులుగా ఉన్నాయి.       

అయితే స్వరజతి అనే ప్రక్రియని నాట్యానికి కాకుండా కేవలం vocal music కోసం మొట్టమొదటి సారి శ్యామశాస్త్రి గారే మలిచారు.  ఈ ప్రక్రియ ని తరువాతి వాగ్గేయకారులు అనుసరించారు, అలా ఈ రచనా శైలి లో evolution వచ్చి ఉండవచ్చు.  

ఇక శ్రీ ముత్తుస్వామి దీక్షితార్ వారి కృతి లోని సాహిత్యం చుస్తే పల్లవి లోనే ఎంతో information ఉంది - కామాక్షి అమ్మవారు కామకోటి పీఠ నివాసిని అని, అలాగే 'కు' అనే అక్షరం చేరుస్తు 'సుమద్యుతి' కుసుమద్యుతి అనే వర్ణన అమ్మవారికి అన్వయిస్తూనే ఆ కృతి కట్టిన రాగ ప్రస్తావన కూడా చేసేశారు. 'సింహేంద్రమాధ్యమం' అనే రాగాన్ని 'సుమద్యుతి రాగం' అంటారు శ్రీ ముత్తుస్వామి దీక్షితార్ రాగ పధ్ధతి లో.   

చరణాల పరిశీలన
ఇప్పుడు త్యాగరాజ స్వామి వారి కామాక్షి కృతి లోని చరణాన్ని పరిశీలిద్దాం 

నరాధములకును వరాలొసగనుం
డరాములై  భూ సురాది దేవత 
లు రాయిడిని జెందరాదు  దయజూ 
డరాద కాంచీపురాధి  నాయకి 


శ్రీ శ్యామశాస్త్రి వారి కామాక్షి స్వరజతి లోని చరణాలు (1 and 9 stanzas)

1.కుందరదనా కువలయనయనా తల్లీ రక్షించు 

9.నీపవన నిలయా సురసముదయా కరవిధృత కువలయా
మద దనుజవారణ మృగేంద్రార్చిత కలుష దహన ఘనా
అపరిమిత వైభవముగల నీ స్మరణ మదిలో తలచిన జనాదులకు 
బహు సంపదలిచ్చేవు మాకభయమీయవే      

శ్రీ ముత్తుస్వామి వారి కామాక్షి కృతి లో చరణం 

కమలేశ సోదరి కమలాక్ష నారాయణి 
నాదబిందు కళా స్వరూపిణి కాత్యాయని 
(మాధ్యమకాల సాహిత్యం) 
కామకళా ప్రదర్శిని కళ్యాణగుణశాలిని 

శ్రీ త్యాగరాజ స్వామి తన చరణంలో 'నరాధములకును' అంటూ మనుషుల్లో చెడ్డవారికి కూడా అంతే గొప్పగా వరాలు ఇచ్చేదానవు ఇక సత్కర్మలు చేసే వారు భయపడాల్సిన పనేంటి అని అంటారు - అంటే ఒకపక్క దేవునికి అందరు సమానులే అని అంటూనే సమాజంలో చెడ్డవాళ్ల గురించి ప్రస్తావిస్తారు - త్యాగరాజ స్వామి ఇలా సమాజం, సత్ప్రవర్తనల గురించి తమ కృతులలో ఎప్పుడు ప్రస్తావిస్తూ ఉంటారు - ఇది వీరి రచనా శైలి. 

శ్రీ శ్యామశాస్త్రి గారి చరణం లో మనం అమ్మవారి ముఖం, కళ్ళు గురించి వర్ణన, ఇతర చరణాలలో ఆమె నడిచే పధ్ధతి, ఆమె స్వరూప వర్ణన కనిపిస్తుంది.  9 వ చరణం లో మణిప్రవాళ రచనా శైలిని అనుసరిస్తూ సంస్కృతం లో అమ్మవారిని నీప వనం అంటే కదంబ వనం లో ఉండే అమ్మవారిగా, దేవతల సముదాయం చుట్టూ ఉండి సేవ చేసే అమ్మగా, మదమెక్కిన రాక్షసులను నియంత్రించే దేవతలలో మృగం వంటి ఇంద్రాది  దేవతల చేత పూజింపబడే అమ్మగా వర్ణిస్తూ చివరి పాదాలు తెలుగులో ముగిస్తారు - ఇది శ్యామశాస్త్రి గారి శైలి.  

శ్రీ ముత్తుస్వామి వారి చరణంలో 'నాదబిందు కళా స్వరూపిణి' అంటూ శ్రీవిద్యా ఉపాసన విశేషాన్ని మనకి తెలియజేశారు, అలాగే అమ్మవారిని తన గురువైన గుహుడు అంటే కుమారస్వామికి తల్లివి అంటూనే 'కామకళా ప్రదర్శిని' అంటూ అమ్మవారి కళలను స్పష్టంగా కూర్చారు.

శ్యామశాస్త్రి గారు కానీ త్యాగరాజస్వామి కానీ అమ్మవారి ఈ రూపాన్ని ప్రస్తావించలేదు. ఎందుకంటే ఇది కేవలం శ్రీ విద్యా ఉపాసన చేసేవారికి మాత్రమే తెలిసే అమ్మవారి స్వరూపం.  ఇది శ్రీ ముత్తుస్వామి వారి శైలి. technical, scientific fact oriented compositions.
ఇది కేవలం వారి సాహిత్యం దాని ద్వారా వారి వ్యక్తిత్వం అర్థం చేసుకొనే ప్రయత్నం మాత్రమే.

composition structure and style comparative analysis
కృతిని మలిచే విధానం అంటే composition structure ని మనం పరిశీలిస్తే శ్రీ త్యాగరాజ స్వామి వారి  కృతులు అంత్యంత క్లిష్టమైన రాగతాళాలని కూడా చిక్కుముడి విప్పినట్టుగా వినేవారికి అందరికి వారి పాండిత్యంతో సంబంధం లేకుండా appeal చేస్తాయి.

శ్రీ శ్యామశాస్త్రి గారి కృతులు భావాన్ని సాహిత్యంకంటే రాగం ద్వారా ఇంకా ఎక్కువ highlight చేస్తూ ఎంత విస్తారంగా, విలంబ కాలం లో పాడితే అంత ఎక్కువ అనుభూతిని, ఆ కృతి యొక్క రుచిని తెలియజేసేలా ఉంటాయి.

శ్రీ ముద్దుస్వామి దీక్షితులు 'సమిష్టి చరణం', 'మాధ్యమకాల సాహిత్యం' అనే ప్రక్రియలతో తమ రచనలని వినూత్నంగా మలిచారు.  ఒకే కృతిలో ఇటు విలంబ, దురిత (slow and fast paces) కాలాలను మలచడం వారి musical genius కు నిదర్శనం.  

ఈ పోలికలు, విశ్లేషణలు కేవలం సంగీతం గురించి మన అవగాహన పెంచుకోడానికి మాత్రమే కానీ త్రిమూర్తుల శైలి ని పోల్చడం, ఎక్కువ తక్కువలు చెయ్యడం కోసం కాదు.  ఈ studies వల్ల మనం కృతులు వినేటప్పుడు ఇంకొంత లీనమై ఆ రచన అందించే పూర్తి అనుభూతిని మనం అనుభవించగలమన్న నమ్మకం.

వచ్చే భాగం లో మరిన్ని విశేషాలు.

ఇట్లు
సుష్మ
సాపాసా 

Comments