సా పా సా వెబ్ సిరీస్ - సంగీత దర్శకులు రవీంద్ర జైన్ గారి విశేషాలు - ఎపిసోడ్ 3

సా పా సా వెబ్ సిరీస్ - ఎపిసోడ్ 3
సంగీత దర్శకులు రవీంద్ర జైన్ గారి విశేషాలు 

Feb 28th - శ్రీ రవీంద్ర జైన్ గారి జయంతి - హిందీ సంగీత దర్శకునికి గురించి తెలుగు లో కార్యక్రమమా ?

సా పా సా లో ఈ సారి రవీంద్ర జైన్ గారి సంగీతాన్ని గురించిన విశేషాలు.  అయితే ఆయన హిందీ సినీ సంగీత దర్శకులు, పాటల రచయిత - భాషా పరంగా ఈ ప్రస్తావన సరైనది కాదనిపించవచ్చు కానీ సంగీత పరంగా వీరి గురించి చెప్పడం ఉచితం. 

ఈ కింద ఇచ్చిన పాటల్లో మీరు ఒక్కటైనా విని, పాటని మెచ్చి ఉంటారని మా నమ్మకం ... 

  • గోరి తేరా గావ్ బడా ప్యారా 
  • గీత్ గాతా చల్ ఓ సాథీ 
  • తుజో మేరె సూర్ మే 
  • సున్ సాయిబా సున్ 
  • ఎక్ రాధా ఎక్ మీరా 
  • ఘున్ఝరు కి తరహా   
ఏమంటారు .... ఒకటో రెండో పాటలు విన్నారు కదా ... 

ఇలాంటి పాటలు భాష, ప్రాంతం అనే పరిమితులు దాటిపోతాయి. వినగానే ఒక హాయిని, ప్రశాంతత ని కలిగిస్తాయి - పాటలో వాడిన వాయిద్యాలు, రాగాలు ఇట్టే వినే వారిని ఆకర్షిస్తాయి. 

ఒకవేళ మీకు రవీంద్ర జైన్ గారి సంగీతం ఇప్పటికే తెలిసి ఉంటే మీరు తప్పకుండా  ఏకీభావిస్తారు - ఒక వేళ మీకు వారి సంగీతం తెలియక పొతే, ఇప్పుడే మీరు వారి గురించి తెలుసుకొని వారి పాటలని వినాలని మా విన్నపం. అంత ఉత్తమమైన సంగీతం వీరిది. 

ఈ ఎపిసోడ్ ని తెలుగు లో చెయ్యడం వెనక ఉద్దేశ్యం ఇదే!

తెలుగు వారి లో ఒక తెగ - హిందీ సంగీత ప్రేమికుల తెగ 

అవునండి - ఈ తెగ ఉంది, ఎప్పటినుంచో ఉంది. సైగల్ ని ప్రేమించింది - కిషోర్, రఫీల ని నెత్తిన పెట్టుకుంది, లత, ఆషాలని ఆప్తులనుకుంది - అంతే కాదు - ఘజల్స్, పాప్, సుగమ్  సంగీత్ - ఇలా అన్ని రకాల సంగీతాన్ని ఆదరిస్తూనే ఉన్నారు!

మేము ఆ తెగ లోని ఒకరికి పుట్టాం 😂 - మా నాన్న గారు మాకు ఉగ్గు తో హిందీ ని పోశారు - భాషా పరంగా, సంగీత పరంగా!   అచ్చ తెలుగు కుటుంబం లో, తెలుగు గడ్డ మీద పుట్టినా, హిందీ వారి జీవన శైలి లో భాగం అయిపోయింది.

అందుకే మాకు ఏ భాషో తెలిసే ముందే రూనా లైలా, నాజియా హస్సన్, ఉషా ఉతుప్, పంకజ్ ఉధాస్ ల తో పాటు, హిందీ సినీ సంగీతం కూడా పరిచయం అయిపొయింది. 

ఒక్కసారి అటువంటి సంగీతం రుచి తెలిసాక, మేము కూడా వదల్లేదు - హిందీ సంగీతం పట్ల ప్రేమ, అవగాహన పెరుగుతూనే వచ్చింది - పాటలు, ఆ పాటలకి సంబంధించిన కళాకారులని గురించి తెలుసుకోవడం ఇవన్నీ మాకు చాలా స్వాభావికంగా వచ్చేశాయి. 

అలాగే మాకు పరిచయం అయ్యారు శ్రీ రవీంద్ర జైన్ గారు.  

రవీంద్ర జైన్ గారి తో మా తోలి పరిచయం (శ్రోతల రూపం లో)
'సీతా రామ్ చరిత అతి పావన్' - ఈ భజన్ గుర్తుందా ?  ఇది దూరదర్శన్ లో రామానంద్ సాగర్ గారి రామాయణం సీరియల్ టైటిల్ ట్రాక్.  ఇక్కడ వినండి - 
చిన్నప్పుడు విన్న ఈ భజన, అలాగే సీరియల్ అయిపోయాక వచ్చే మరో ట్రాక్ చాలా నచ్చాయి అప్పట్లోనే. 

Ramayan Serial on DD
కానీ వారి గురించి మాకు సరిగ్గా తెలిసింది ఏసుదాస్ గారు పాడిన హిందీ పాటల ద్వారా - నిజానికి రవీంద్ర జైన్, ఏసుదాస్ ల కాంబినేషన్ లో ఎన్నో మంచి పాటలు వచ్చాయి.  

మొట్టమొదట మేము విన్నది 'చిత్ చోర్' లో పాటలు - ఒక్కో కుటుంబానికి ఒక్కో సినిమా, ఒక్కో పాట ఉంటూ ఉంటాయి కదా - అలాగే ఒకప్పుడు మా కుటుంబ గీతం 'గోరీ తేరా గావ్ బడా ప్యారా' భజన్ లెవెల్ లో అందరు అందుకునే వారు - అంత్యాక్షరుల్లో, ఇలా ప్రతి గెట్- 
టుగెదర్ లో ఈ పాట చాలా పాపులర్. 

ఈ సినిమా లో ఇతర పాటలని తెలుసుకున్నప్పుడు ఇంకా ఆశ్చర్యపోయాం - ప్రతీ పాట ఎంత బాగుంటుందో!  రవీంద్ర జైన్ గారు సంగీతం కట్టడమే కాదు - పాటలు వ్రాశారు కూడా.

రవీంద్ర జైన్ గారి సంగీత సౌరభం 
1970ల్లో డిస్కో పాప్ లాంటి సంగీత శైలులు హిందీ సినీ సంగీతం లో కి చొచ్చుకుని వస్తున్న సమయం లో హిందుస్తానీ శాస్త్రీయ సంగీతం, లలిత శాస్త్రీయ సంగీత ప్రక్రియలతోనే అద్భుతాలు సృష్టించారు. 

వారి పాటలు, వాడిన రాగాలు 
జబ్ దీప్ జలే ఆనా - యమన్ / కళ్యాణి 
షామ్ తేరి బన్సీ - చారుకేశి 
జో బైఠె చరణో మే తుమ్హారే - దర్బారీ కానడ 
ఎక్ రాధా ఎక్ మీరా - కీరవాణి (హిందుస్తానీ)

వారు సృష్టించిన అద్భుతాలలో మొట్టమొదటిది, వెలువడనిది అయినది ఒకటి ఉంది - అదే 'షడజ్ నే పాయా యే వరదాన్' 
Shadaj Ne Paaya - full song here!
ఈ పాట వినడానికే విద్వత్తు కావాలి - గ్రహభేదం అనే ఒక గొప్ప ప్రక్రియ ఉంది శాస్త్రీయ సంగీతం లో - తాన్ సేన్ తన విద్వత్తుని ప్రదర్శించే సందర్భం కోసం ఈ పాట చేశారు - కానీ అది వెలువడలేదు - ఈ పాట ఏసుదాస్ గారు పాడి ఒక సంచలనం సృష్టించారు.  

ఈ పాట వల్ల రవీంద్ర జైన్ గారికి సంగీతం మీద ఉన్న పట్టు మనకి అర్ధం అవుతుంది. 

రవీంద్ర జైన్ - సుస్వర సంగీతానికి చిరునామా 
ఎలాగైతే కే వీ మహదేవన్ గారి అన్ని పాటలు మధురం గా ఉంటాయో - అలాగే రవీంద్ర జైన్ గారి సంగీతం మొత్తం సుస్వరం గా  అంటుంది. 

చల్లని సాయంత్రం వేళ, మలయమారుతం వీస్తూ ఉండగా, పక్షుల కువకువలు, చుట్టూ పూల మొక్కలు, అందమైన మేడ ... వీటన్నిటి మధ్య ఉన్నప్పుడు కలిగే భావన రవీంద్ర జైన్ గారి సంగీతం విన్నప్పుడు కలుగుతుంది (మనం ఎక్కడ ఉన్నా)!

వీరి సంగీతానికి తగ్గట్టుగా సాహిత్యం ఎలా కుదిరింది అనిపించింది - ఎందుకంటే వాక్కు గేయం రెండు వారివే. 

ఈ పాట ని వినండి!  

DDLJ - దిల్వాలే దుల్హనియా లేజాయేంగే !
ఇప్పుడీ సినిమా సంగతి ఎందుకు? అంటే - ఈ సినిమా కున్న క్రేజ్ మీకు తెలుసు  - తెలియకపోతే మరీ మంచిది - ఒక యువకుడు ఒక పెద్దమనిషి తో గొడవపడటం, ప్రేమలో పడటం, ఆ గొడవ పడ్డ వ్యక్తి కాబోయే మావగారు అవ్వడం, ఆ తరువాత వారి ఇంట జేరి సరస సామ దాన భేద ఉపాయలతో ప్రేమని దక్కించుకోడం అనే స్క్రీన్ప్లే ని పరిచయం చేసిన సినిమా అది - ఇంతకీ ఇంతటి హిట్టు సినిమా టైటిల్ వీరి సినిమా పాట లోంచే వచ్చింది - ఈ పాట ఇంకొక రచయిత తో కలిసి వ్రాసినట్టు గా క్రెడిట్స్ లో కనబడుతుంది.  

ఇదే సినిమా లోని ఇంకో పాట వీరు వ్రాసి కట్టారు -
' ఘున్  ఘురూ కీ తరహా ' అనే పాట - కాలి అందెల గురించిన పాట ఇది 

రవీంద్ర జైన్ సంగీతం లో కృష్ణ తత్త్వం 
Sri Ravindra Jain & Sri Latha Mangeshkar at recording session for 'Chittiye' Heena Movie!

రవీంద్ర జైన్ గారి పాటల్లో కృష్ణ తత్త్వం చాలా తమాషా గా గోచరిస్తుంది - ఈ పాట గమనించండి 

"శామ్ తేరి బన్సీ పుకారే రాధా నామ్ 
లోగ్ కరే మీరా కో యూహి బద్నామ్"

కృష్ణుడి వేణువు రాధా పేరు పలుకుతూ, ఆమెనే పిలుస్తూ ఉంటుందట, కానీ అందరు మీరా ని ఆడిపోసుకుంటారు పాపం - అనే అర్ధం తో ఉంటుంది ఆ పాట 

అలాగే 

"ఎక్ రాధా ఎక్ మీరా - దోనో నే శామ్ కో చాహా 
అంతర్ క్యా దోనో కి ప్యార్ మే బోలో 
ఏక్ ప్రేమ్ దివాని ఏక్ దరస్ దివాని"

రాధా మీరా ఇద్దరు కృష్ణుడిని ప్రేమించారు - ఇద్దరి ప్రేమలో తేడా ఏంటి? ఈమె అనురాగం కోరుకుంది ఆమె దర్శనం కోరుకుంది 

ఇలాంటి అర్ధం లో ఉంటుంది 

ఇంకో పాట 

షామ్ రంగ్ రంగారె - హర్ పల్ మేరా రే 
మేరా మత్ వాలా హై మన్ - మధుబన్ తేరా రే 

నా మనసు కృష్ణుడి రంగు రూపాలతో నిండి ఉంది - నా మనసు ఆయన తిరిగే మధువనము. 
Listen to the magic of dholak in this song!

వారు ఎంచుకున్న గళాలు 
చాలా వెరైటీ గా ఉంటాయి వారు ఎంచుకునే గళాలు - ప్రాంతీయతని ఉట్టిపడుతూ ఉంటాయి - వైవిధ్యంగా ఉంటాయి - వారి టీం లో ఉన్న గాయక సభ్యులు 

ఏసుదాస్ గారు 
జస్పాల్ సింగ్ 
హేమలత 
ఆరతి ముఖర్జీ ... మొదలైన వారు 


రవీంద్ర జైన్ గారి తో శ్రీ రామారావు గారు ఇతర ప్రముఖులు
Source - Ravindra Jain Group-Music Director (Facebook)


వారి జీవన సారం - ఈ పాట!

తు జో మేరె సుర్ మే - Listen to the full Song with lyrics here
(అంటే - నువ్వు నా తో శృతి కలిపితే... )
మనసున మనసై అని ఆత్రేయ గారు వ్రాశారు - వారు మనసు కవి కాబట్టి మనసున మనసుగా ఉండే తోడు గురించి వ్రాశారు - రవీంద్ర జైన్ గారు సంగీతజ్ఞులు.  అందుకే 'నాతో శృతి కలిపి, నాతొ పాటు పాడితే, జీవితం సఫలం' అని వ్రాశారు ఈ పాటలో!

ఈ పాట నిజానికి ఒక ఉత్తమమైన జీవన విధానాన్ని సూచిస్తుంది - ఈ చరణం చుడండి 

'క్యో హం బహారో సే - ఖుషియా ఉధార్ లే?
క్యో నా మిల్కే హమ్ హి ఖుద్ అప్నా జీవన్ సవార్ లే?

'మనం మన సంతోషాల ని వసంతం నుంచి అరువు తీసుకోవాలా? మనం కలిసి మెలిసి మన జీవితాన్ని దిద్దుకోకూడదా?' అంటారు రవీంద్ర జైన్! 
, Sri Ravindra Jain with Sri Raj Kapoorand Lataji at recording session

ఎంత గొప్ప ఆలోచనో కదా!

బాహ్య ప్రపంచం ఆయన్ని 'కళ్ళు లేని వాడు' గా పరిగణిస్తారు కానీ ఆయనకి జీవితం పట్ల స్పష్టమైన దృష్టి ఉంది. అదే ఆయన సంగీతం లో, ఆయన సాహిత్యం లో కనిపిస్తుంది. 

వారి సంగీతం అమరం - కొత్త వారు వారి సంగీతానికి ఆకర్షితులు అవుతూనే ఉంటారు - వారి సంగీత సాహిత్యాల ద్వారా వారు చిరంజీవి అయ్యారు!


ఇవి ఇవ్వాల్టి ఎపిసోడ్ విశేషాలు!

Yours musically
Sushma Nittala 

Comments