సా పా సా తెలుగు శతక పద్యాలు - Episode 2



Sa Pa Sa Musical Web Series - Season 1 - Episode 2
On the occasion of International Mother Language Day
Watch full episode here (Telugu Padyalu)

సా పా సా అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం సంబరాలు 
21st February అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం - తెలుగు వాళ్ళం అయినందుకు ఆ భాష గొప్పదనాన్ని గుర్తు చేసుకొనేందుకు మంచి అవకాశం కూడా.  ఈ సందర్భంగా తెలుగు భాష లోని 'పద్యం' అనే ప్రక్రియ గురించి ఈ రోజు సా పా సా.

Telugu Script
తెలుగు పద్యం - మహా సముద్రం 
తెలుగు పద్యం గురించి ప్రస్తావించడం సాహసమే అవుతుంది - అంతటి మహా సముద్రం లోంచి ముత్యాలు, పగడాల్లాంటి శతక పద్యాల ని కూర్చి ఈ ఎపిసోడ్ తయారు చేశాము. 
శతకం అంటే ఏంటి ?
శతకం అంటే 100 లేదా 108 పద్యాలున్న రచన - ఈ పద్యాలన్నీ ఒకే అంశం మీద ఉండచ్చు ఉండకపోవచ్చు - ఇలా ఒక అంశం మీద లేని శతకాలని ముక్తకాలు అంటారు. 

శతకం లక్షణాలు ఇవే :
1  శతకం లో  100 or 108 పద్యాలుంటాయి  
2  ప్రతి పద్యము దాదాపు ఒకే ఛందస్సు లో ఉంటుంది 
3  ప్రతి శతకం ఒక ప్రార్ధనా పద్యం లేదా కవి ఉద్దేశాన్ని తెలిపే పద్యం గా ఉంటుంది 
4  శతకం లోని ప్రతి పద్యం ఒకే పదం లో ముగుస్తుంది దీన్నే మకుటం అని అంటారు 
5 ఈ మకుటం శతక కర్త పేరు, లేదా ఒక దైవం, సంబోధన, క్షేత్రం - ఇలాంటి అంశాలని తెలిపేలా ఉంటుంది 

కొన్ని ఉదాహరణలు :
'విశ్వదాభిరామ వినుర వేమా' 
కవి - వేమన 
విశ్వదా అభిరామ అన్నవారు  
జీవితం లో ని ఇద్దరు ముఖ్య వ్యక్తులు 






'శ్రీ కాళహస్తీశ్వరా'
కవి - ధూర్జటి 
ధూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకం రాశాడు 
'దాశరథి కరుణాపయోనిధి'
కవి - 'భక్త రామదాసు' కంచర్ల గోపన్న 
దాశరథి అంటే దశరథుని కుమారుడు అని అర్ధం 

'సుమతి'
కవి - బద్దెన భూపాలుడు 


ఇవ్వి ఈ శతక పద్యం యొక్క ముఖ్యమైన లక్షణాలు - ఈ ఎపిసోడ్ లో కొన్ని బాగా తెలిసినవి, గొప్పవి అయిన శతక పద్యాలని తలచుకుందాము. 

ఈ ఎపిసోడ్ ఎందుకు చాలా ప్రత్యేకం?
అసలు పద్యమే ఎంతో అందంగా ఉంటుంది వినడానికి .. అలాంటి పద్యాన్ని రాగం కట్టి పాడితే 
CD cover art of Telugu Padyalu Audio
ఇంకా ఎంత బాగుంటుందో కదా, పాడేవారికి వినేవారికి కూడా ఎంతో ఆనందాన్ని ఇస్తుంది పద్యగానం.   
నాకు పద్యాలకి రాగాలని కూర్చి పాడటం అంటే చాలా ఇష్టం, శ్రద్ధ.  ఇలా పిల్లలకి పద్యాలని దగ్గర చెయ్యాలని చేసిన ప్రయత్నమే నా 'తెలుగు పద్యాలు' ఆడియో 
సి. డి. 
ఇప్పటికే పద్యబాలశిక్ష పేరుతో ఒక సిరీస్ మొదలుపెట్టాము - దీని గురించి వివరం గా మరోమారు ప్రస్తావిస్తాము. 



ఇక పద్యాలు పాడుకుందాం .... 

1
శతకం = వేమన, వేమన = శతకం !
తెలుగు ప్రజలకి ఆత్మీయుడు వేమన.  వేమన వ్రాసిన పద్యాలు ఇప్పటికి 
Chittor V Nagayya as Yogi Vemana
Watch Yogi Vemana Movie Here (Volga Videos)
ప్రజల నోళ్ళల్లో నానుతున్నాయి - 'ఎపుడో చెప్పెను వేమన గారు' అంటూ తెలుగు సినిమా పాటలో కూడా ప్రస్తావన ఉంది.  నిజానికి వేమన కొన్ని వేల పద్యాలు వ్రాసినా అన్నిటిని కలిపి వేమన శతకం అనే వ్యవహిరిస్తారు  

వేమన శతకం సమాజాన్ని కాచి వడపోసినట్టు ఉంటుంది. జీవిత సారం, మానవత్వం ఈ శతకం లో విశేషాలు !

మేము ఎన్నుకున్న వేమన పద్యం - 'అనగననగ రాగం' - జీవితం లో ఏది పట్టుబడాలన్నా ఏంటి రహస్యం? వేమన్న చెప్పాడు - సాధన - సాధన చెయ్యాలంటే సహనం కావాలి -  అందుకే ఈ పద్యాన్ని 'శహన' రాగం లో కట్టాను 

అనగ ననగ రాగ మతి శయిల్లుచునుండు 
తినగతినగ వేము తియ్యనుండు

సాధనమునపనులు సమకూరు ధరలోన

విశ్వదాభిరామ వినురవేమ.

పాడుతూ పాడుతూ ఉంటే పాట మెరుగు అవుతుంది, 
తింటూ తింటూ ఉంటే చేదు కూడా అలవాటు అయ్యి తియ్యగా ఉంటుంది 
సాధన చేస్తూ ఉంటేనే ఈ లోకం లో ఏ పనైనా సాధ్యం అవుతుంది 
విను ఓ విశ్వదా అభిరాముల వేమా !
2
సుమతి శతకం  = మంచి నడవడిక, జీవన విధానం, సమాజం లో జరిగేవాటిని ప్రకృతి లో జరిగే వాటితో ఉదాహరించి చెప్పడం 
(మరింత ఇక్కడ చదవచ్చు Sumathi Sathakam)
బద్దెన భూపాలుడు చోళ రాకుమారుడు, కవి - ఆయన వ్రాసిన సుమతి శతకం 13వ శతాబ్దానికి చెందినది.  సుమతి అంటే మంచి బుద్ధి కలవారు అని అర్ధం.  

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అప్పుడెప్పుడో 7 శతాబ్దాల కిందట వ్రాసిన మనుషుల స్వభావం, సమాజం లో పరిస్థితులు ఇప్పటికి వర్తించడం - ఇది చూసి ఆనందించాలో బాధపడాలో తెలియట్లేదు - అంటే ఇప్పటికి మనిషి ఆలోచనా ధోరణి లో ఎటువంటి మార్పు రాలేదా? ఏమో!

ఈ ఎపిసోడ్ కి మేము ఎన్నుకున్న పద్యం - 'ఉపకారికి' ఇది నేను కళ్యాణి లో కట్టాను - ఆ ప్రతి మధ్యమం పడితే కానీ 'అపకారి' అన్న పదం సరిగ్గా పలకదు మరి! 😉





ఉపకారికి నుపకారము
విపరీతముగాదు సేయ వివరింపంగా
అపకారికి నుపకారము
నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ!


ఈ పద్యం మనసులో కలకలం రేపుతుందండి - ఎన్నో ప్రశ్నలు అనుమానాలు కలుగుతాయి - ఒక్కసారి గా మంచి చేసిన వాళ్ళు, చెడు చేసిన వాళ్ళు కళ్ళముందు కదులుతారు - మంచి కి మంచి చెయ్యడం కొంచం సులభం - కానీ ఆ చెడు చేసినవాళ్ళకి ఎంచకుండా మంచి చెయ్యడం తరమా? సాధ్యమా? అసలు చెయ్యాలా? చెయ్యచ్చా? అమ్మో!

నాకో సందేహం ఉంది - మంచి చేయువాడు ధన్యుడు కావాలి కానీ నేర్పరి ఎలా అవుతాడు 
చెప్మా ?!



3
శ్రీ కృష్ణ శతకం = శ్రీ కృష్ణునికి సర్వస్య శరణాగతి 
'అజ్ఞాత రచయిత' - ఈ మాట వినంగానే నాకు బాధ, కోపం, ఆశ్చర్యం ఒకేసారి కలుగుతూ ఉంటాయి.  సాహిత్యం తో పాటు సంగీతం లో కూడా ఈ అజ్ఞాత కృతి కర్తలు ఉన్నారు - వసంత రాగం లోని వర్ణం 'నిన్నుకోరి' కర్త ఎవరో తెలియదు - 'పూర్వీకుల రచన' అని ఉంటుంది ఏంటో. 
ఇందుకే ముద్రలు చాలా ముఖ్యం - తమ శైలి ని రచనల్లోకి ముద్రా రూపం లో అల్లిన వారు మనకి తెలిశారు - ఏమో, తాను ఎవరికీ తెలియకూడదని అనుకున్నాడేమో ఈ రచయిత - తన ఉనికి ని కూడా తెలియనివ్వకుండా అద్భుత రచనా సంపద అందించాడు (అందించింది - ఏమో చెప్పలేము)!   

ఇంకో సరదా విషయం ఏంటంటే 100 పద్యాలు గుర్తుపెట్టుకున్నాము  కానీ ఒక్క పేరు గుర్తుపెట్టుకోలేకపోయాము .. ప్చ్ !!

మరి ఈ ఎపిసోడ్ లో శ్రీ కృష్ణ శతకం లోని రెండవ పద్యాన్ని ఎంచుకున్నాము - దీన్ని మోహన రాగం లో కట్టాను. 

Sri Krishna Satakam Book


నీవే తల్లివి తండ్రివి
నీవే నా తోడు నీడ నీవే సఖుడౌ
నీవే గురుడవు దైవము
నీవే నా పతియు గతియు నిజాముగ కృష్ణా!







ఒక్కోసారి ఈ ప్రాపంచిక సంబంధాలు విఫలం అయినప్పుడు ఎన్నటికీ మారని, నిత్యమూ సత్యము అయినా దైవాన్నే సర్వస్వము గా భావించడం భక్తుల లక్షణం. 


4
శ్రీ కాళహస్తీశ్వర శతకం  = కాళహస్తీశ్వరుడి విశేషాలు, సమాజం యొక్క నిజాలు - నిష్కర్షగా వర్ణించే శతకం !
మహాకవి ధూర్జటి ఈ శతకంలో తన భక్తి నంతా కాళహస్తీశ్వరుడి కి పద్య రూపం లో సమర్పిస్తాడు, మరో వంక సమాజం అంటే విరక్తి కూడా తెలియజేస్తాడు.  ఆయన అష్టదిగ్గజాల్లో ఒకడు - కృష్ణ దేవరాయల వారి ఆస్థానం లో - అయినప్పటికీ 'రాజుల్మత్తులు వారి సేవ నరకప్రాయం' అనే పద్యాన్ని వ్రాశాడు. ఇలా వ్రాసినట్టు కృష్ణదేవరాయలవారికి తెలుసంటారా? తెలిస్తే ఆయన ఎలా స్పందించి ఉంటాడు? స్వయంగా తాను ఒక కవి కాబట్టి సాటి కవి హృదయాన్ని అర్ధం చేసుకొన్నాడేమో.

Sri Kalahasti Temple architecture




ఈ  ఎపిసోడ్ కి మేము ఎన్నుకున్న పద్యానికి ఒక చాలా ప్రత్యేకత ఉంది 


ఏ వేదంబు బఠించె లూత భుజంగం బేశాస్త్రముల్సూచె దా
నే విద్యాభ్యసనంబొనర్చెఁ గరి చెంచేమంత్ర మూహించె బో
ధావిర్భావనిదానముల్ చదువులయ్యా!కావు! మీ
పాదసంసేవాసక్తియె కాక జంతుతతికిన్ శ్రీ కాళహస్తీశ్వరా!


ఇక ప్రత్యేకత విషయానికి వస్తే - ఒక పండితుడు, చదువుకున్నవాడు - తన చదువు వల్లే కొలువు చేస్తున్నవాడు, పేరు తెచ్చుకున్నవాడు - నిజమైన చదువంటే అదంతా కాదని - శివుని పద భక్తి అనే చేతన యే చదువు అని చెప్పడం, ఆ సాలిపురుగు, పాము, ఏనుగు, కన్నప్ప కున్న జ్ఞానమే నిజమైన జ్ఞానమని చెప్పే పద్యం ఇది!

ఈ పద్యాన్ని రేవతి రాగం లో కట్టాను - రేవతి విన్న వెంటనే ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని కలగజేస్తుంది - వైరాగ్యాన్ని భక్తిని లక్షణాలుగా కలిగిన రాగం రేవతి ఈ పద్యానికి సరైనదనిపించింది. 


5
నరసింహ శతకం = సర్వ జీవులని సమానంగా చూడటం, నరసింహ స్వామి పట్ల అపారమైన భక్తి 

ఈ శతకం మకుటం 
'భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్టసంహార నరసింహ దురితదూర 

Dharmapuri Temple





ఈ మకుటం లాగానే పద్యాలు కూడా చాలా పెద్దవి. మొదటి భాగం సీస ఛందస్సు లో ఉంటుంది రెండవ భాగం తేటగీతి లో ఉంటుంది.  
ధూర్జటి శార్దూల మత్తేభాల లో రాశాడు (అంటే సింహం ఏనుగు అన్నమాట) 
రామదాసు పద్యాలూ ఉత్పలమాల, చంపకమాల ఛందస్సుల్లో ఉంటాయి. 
ఈ ఛందస్సుల గురించి మరింత ఇక్కడ చదవచ్చు. 


ఈ ఎపిసోడ్ కోసం మేము ఎంచుకున్న పద్యం నేను కాంభోజి రాగం లో కట్టాను 
స్తంభమందుదయించి పద్యం  పెద్దబాలశిక్ష లోంచి 

దాశరథీ శతకం  = రామమయము 
భక్త రామదాసు (కంచెర్ల గోపన్న) 'భద్రాచల రామ' అనే ముద్ర తో అనేక సంకీర్తనలు వ్రాయడం తో బాటు 'దాశరథీ కరుణాపయోనిధీ' అనే మకుటం తో శతకం కూడా వ్రాసాడు.  అంటే అని కీర్తనలు వ్రాశాక కూడా ఇంకా రాముడి గురించి చెప్పడానికి ఆయన దగ్గర బోలెడంత ఉందన్నమాట! 

ఈ ఎపిసోడ్ కోసం మేము ఎంచుకున్న పద్యం శతకం లోని మొట్టమొదటి పద్యం -  హిందోళ రాగం లో కట్టాను                                                                                  

Unique idols of Bhadrachalam in
Bapu's Painting


శ్రీ రఘురామ చారు తులసీ దలధామ శమక్షమాది శృం
గార గుణాభిరామః త్రిజగన్నుత శౌర్య రమాలలామ దు
ర్వార కబంధరాక్షస విరామః జగజ్జనకల్మషార్ణవో
త్తారకనామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ


7
లలిత సుగుణజాల తెలుగు బాల = తెలుగు భాషా వైభవం
జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి కలం పేరు 'కరుణశ్రీ' - మామూలుగానే కవులు సున్నిత మనస్కులు - కరుణశ్రీ గారు మరో రెండు చుక్కలు ఎక్కువ కరుణామూర్తి - లేకపోతే పువ్వుల గోల ని గురించి ఎవరు పట్టించుకుంటారు? ప్రకృతి అంతా తన అవసరాల కోసమే ఉంది అనే మనిషి స్వార్ధం ఈ కవిత ని చూసి ఉలిక్కిపడింది - మనం ప్రకృతి లో భాగం మాత్రమే.. మనలాగే ఇతర జీవులకీ జీవం, భావం ఉంటాయని తెలిపింది ఈ కవిత అదే 'పుష్పవిలాపం'
Listen to Pushpavilapam here tuned by Ghantasala garu


కరుణశ్రీ గారు మా తాతగారు మంచి స్నేహితులని మా అమ్మ చెప్పేది.  తరచుగా ఇంటికి వచ్చి పలకరిస్తూ ఉండేవారట !

వారు వ్రాసిన శతకమే 'తెలుగు బాల' అందులోని మకుటం 'లలిత సుగుణజాల తెలుగుబాల' 
'Karunasri'

ఈ ఎపిసోడ్ కోసం మేము ఎంచుకున్న పద్యం ఆనంద భైరవి రాగం లో కట్టాను - ఆ రాగ లక్షణమే కరుణ కదా !


తెనుగుదనము వంటి తీయదనము లేదు 
తెనుగు కవులవంటి ఘనులు లేరు 
తెనుగు తల్లి సాధుజన కల్పవల్లిరా 
లలిత సుగుణజాల! తెలుగు బాల!

ఎటువంటి మొహమాటాలు లేకుండా తెలుగుని తెలుగు కవులని కొనియాడిన పద్యం ఇది!




8
ఇక ఈ ఎపిసోడ్ కి సరైన ముగింపుని ఇస్తుంది ఈ పద్యం - ఇది ఇప్పటి కవి అయిన మీగడ రామలింగస్వామి వ్రాశారు - పెద్ద బాలశిక్ష లో దొరికింది మాకీ పద్యం - ఆనందభైరవి లోనే స్వరపరచాను. 
Meegada Ramalingaswamy
                                        

ఉగ్గు పాల నుండి ఉయ్యాల లో నుండి 
అమ్మ పాట పాడినట్టి భాష 
తేనె వంటి మందు వీనులకును విందు 
దేశభాషలందు తెలుగు లెస్స 

మకుటం గమనించారా? శ్రీ కృష్ణ దేవరాయలు గారి పద్యం





దీన్ని మకుటం గా తీసుకొని తెలుగు భాష మీద మంచి పద్యం వ్రాశారు కవి!






ఇవి సా పా సా అంతర్జాతీయ మాతృ భాష దినోత్సవ ఎపిసోడ్ విశేషాలు !


Yours musically 
Sushma Nittala
for Sa Pa Sa
   

Comments