సా పా సా - బతుకమ్మ పాట 2018
| బతుకమ్మ పాట లో భాగం Listen to the Bathukamma Song Here! | 
ఏంటీ పాట?
కథ ఏంటి?
బతుకమ్మ పండుగకి సంబంధించిన కొన్ని కథల్లో ఒకటి - ఒక అన్నా చెల్లెళ్ళ కథ.  వారు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు - చెల్లికి పెళ్లి చేసి పంపిస్తాడు అన్న - కానీ ఆమె ఇంట్లోంచి వెళ్ళిపోయిన తరువాత కూడా ఆమెను ప్రేమగా గుర్తు చేసుకుంటూ ఉండేవాడు - ఇది అతని భార్య కి అస్సలు నచ్చలేదు - ఎప్పుడు చూసినా ఆడపడుచు గురించి మాట్లాడుతూ ఉంటాడు అని కుళ్ళుకునేది - ఆ కుళ్ళు ఎంత పెరిగిపోయిందంటే, ఒకసారి ఆ చెల్లి ఇంటికి వస్తుంది - అప్పుడు భర్త లేని సమయం చూసి ఆడపడుచు ని చంపేస్తుంది ఈ వదిన - చంపి పెరట్లో పాతేస్తుంది. 
కథ ఎలా కదిలించింది? 
ఇది కథ కంటే కూడా యదార్థం అనిపిస్తుంది.  ఎందుకు ఆడది ఆడదానికి శత్రువు? ఎందుకు ఒక స్త్రీ కి ఇంకో స్త్రీ అంటే అంత వైషమ్యం?  ఇది తరతరాల 'డివైడ్ అండ్ రూల్' వల్ల వచ్చిందా లేదా స్త్రీల తత్వమే అంతా? 
స్త్రీ లోని ఆ కోణం 
తన ఇంటిని మాత్రమే శుభ్రంగా ఉంచుకొని బయటంతా చెత్త ఎందుకు వేస్తుంది?  తాను స్వయంగా మాతృమూర్తి అయి ఉంది తన పిల్లలకి వేరే పిల్లలకి అంత భేదభావం ఎలా చూపగలుగుతుంది?  తనకంటే కొంచం మెరుగ్గా ఉన్న స్త్రీ ని చూసి ఎందుకు న్యూనత చెందుతుంది? తన కూతురి వయసుదైనా కోడలిని ఎందుకు ద్వేషిస్తుంది?
కుటుంబ వ్యవస్థ లో, సమాజం లో స్త్రీల కి ఒకరి పట్ల ఒకరికి సానుభూతి లేని పరిస్థితి కి కారణం ఏంటి? ఇలాంటి ప్రశ్నలు వాటి వల్ల వచ్చిన ఆలోచనల రూపమే ఈ పాట. 
నిజమైన పండుగ 
బహుశా ఆడవారంతా కలిసి మెలిసి ఉండాలని పెట్టిన సంప్రదాయమేమో ఈ ఆటలు పాటలు అన్ని - అది explore చేస్తూనే ఈ పాట - బతుకమ్మ పండుగ వెనుక ఉన్న నిజమైన అర్ధాన్ని ఆకళింపు చేసుకుంటూ!
ఆడవారి మధ్య స్నేహ సంబంధాలు ఉండాలి, ఒకరికి ఒకరై ఆడవారు తమకు ఎదురయ్యే కష్టాలని అధిగమించాలి - ఏ స్త్రీదైనా దాదాపు అవ్వే కష్టాలు - మరి ఎందుకు చిన్న చూపు? ఎందుకు కుళ్ళు కక్ష, వైషమ్యం?
#womencamaraderie ఆడవారి మధ్య స్నేహ సంబంధాలు 
ఈ పాట ఒక సరికొత్త బాటలో స్త్రీలను పయనించగా చూడాలని ఆశతో వ్రాసిన పాట - 
బతుకమ్మంటే ఏందమ్మా ?
బతుకమ్మ పాట 
రచన సంగీతం - సుష్మ నిట్టల 
గానం - సుష్మ సౌమ్య 
బతుకమ్మా బతుకమ్మా 
బతుకమ్మంటే ఏందమ్మా 
బతుకమ్మా బతుకమ్మా 
ఆడబిడ్డలందరి బతుకమ్మా 
మన కష్టాలు కన్నీళ్లు మనకే తెలుసులే బతుకమ్మా 
ప్రతిరోజు ప్రతిపూటా పోరాటమే ఆడబతుకమ్మ ||
గొప్పింట పుట్టినా బతుకమ్మా
పేదింట పుట్టినా బతుకమ్మా
ఆడది ఆడదే బతుకమ్మా
అమ్మోరి రూపమే బతుకమ్మా
లావు సన్నం కాదు బతుకమ్మా
నలుపు తెలుపు కాదు బతుకమ్మా
మనసు మంచితనం బతుకమ్మా
పంచిన బతుకే బతుకమ్మా ||
అద్దం లో చూడమ్మా బతుకమ్మా
నీ ముద్దు మొగమమ్మ బతుకమ్మా
అందమే కాదమ్మ బతుకమ్మా
నీ గుండె బలమూ చూడు బతుకమ్మా
తలసుకుంటే నువ్వు బతుకమ్మా
జరగంది లేదే బతుకమ్మా ||
అత్తింటి కష్టాలు పుట్టింటి కష్టాలు 
పెనిమిటీ పిల్లలా కష్టాలు 
చెప్పొచ్చే కష్టాలు అనుకోని కష్టాలు 
చినచిన్న కష్టాలు పెదపెద్ద కష్టాలు ||
ఎన్నీ కష్టాలైనా బతుకమ్మా 
ఇష్టంగా మోసేవు బతుకమ్మా 
బతుకంటే ఏందో బతుకమ్మా 
బతికీ సూపించేవు బతుకమ్మా||
ఆడబిడ్డలందరం  బతుకమ్మా 
కలిసీమెలిసుందాము బతుకమ్మా 
సాటి ఆడదాన్ని బతుకమ్మా 
స్నేహంగ చూసేము బతుకమ్మా 
పండగ రోజులన్నీ బతుకమ్మా 
ఆడిపాడుదాము బతుకమ్మా 
ఒకరీకొకరాముంటే బతుకమ్మా 
బతుకంత పండుగే బతుకమ్మా ||
బతుకమ్మా బతుకమ్మా 
బతుకమ్మంటే ఏందమ్మా 
బతుకమ్మా బతుకమ్మా 
బతుకంటే గిదే బతుకమ్మా ||
చల్లంగ నువ్వు బతుకమ్మా 
చల్లంగుందామమ్మ బతుకమ్మా 
చల్లంగ చూడమ్మా బతుకమ్మా ||  
ఇట్లు 
సా పా సా 
Comments