శాస్త్రీయ సంగీత చరిత్ర
కర్ణాటక సంగీత చరిత్ర, పరిణామ క్రమం గమనిస్తే, జానపద సంగీతం నుంచి ప్రేరణ పొంది (యదుకుల కాంభోజి జానపద సంగీతం నుంచి తీసుకున్న రాగం), వేద పఠనం నుంచి నాదం యొక్క అవగాహన జన్మించి (మొట్టమొదట మనిషి గుర్తించిన రాగం ఖరహరప్రియ - సామవేదం ఈ రాగం స్వరాలతోనే పఠిస్తారు), ఎన్నో experiments కి, researchలకి ఫలితంగా సంగీతం ఒక శాస్త్రం గా ఆవిర్భవించింది.
ప్రకృతి సంగీతమయం
నిజానికి సంగీతం ప్రకృతి లో ఉంది. మనిషి తన కష్టం నుంచి సేద దీరడానికి, తన భావాలు వెలిగక్కడానికి సంగీతాన్ని ఎప్పుడూ ఆశ్రయిస్తూ వచ్చాడు. అమ్మ జోల, బరువులు మోసేటప్పుడు 'హయ్య హై' అనే బృంద శబ్దాలు, కథలు చెప్పేటప్పుడు, కలిసిమెలిసి ఆనందం గా ఉన్నప్పుడు - తన స్వరపేటికే ఆధారంగా సంగీతాన్ని సృష్టించడం మనిషికి సహజంగా వచ్చింది.
సంగీత వాయిద్యాల ఆవిర్భావం
ఆ తరువాత పిల్లనగ్రోవి, డప్పు లాంటి వాయిద్యాలు తయారుచేసుకోవడం, అంటే ప్రకృతి లో లభించే వెదురు, జంతు చర్మాల తోనే వాయిద్యాలు మలచబడ్డాయి. మనిషికి metals - లోహాలు వాడటం రావడం తో తంత్రీ వాయిద్యాల (తీగలు) తయారీ మొదలైంది.
కర్నాటిక్ మ్యూజిక్ ఆరిజిన్ అండ్ ఎవల్యూషన్ - కర్ణాటక సంగీత ఉత్పత్తి, పరిణామ క్రమంలో శ్రుతులు (notes), రాగాలు ఏర్పడడానికి ఈ తంత్రీ వాయిద్యాలు ఎంత కీలకమైన పాత్ర పోషించాయో అర్ధం అవుతుంది.
సంగీతం - పురాణం
ఇదంతా సంగీత చరిత్ర. ఇక పురాణాల విషయానికి వస్తే, సంగీతం పరలోకం నుంచి మనిషికి వచ్చినట్టు తెలుస్తుంది. నారద మహాముని చేతిలో 'మహతి' అనే వీణ ఉంటుందని వర్ణలలో ఉంటుంది. అలాగే వివిధ దేవతామూర్తులు ఆయుధాల తో సమానంగా ఈ సంగీత వాయిద్యాలని ధరించడం స్తోత్రాలలో వర్ణించడం జరిగింది.
ఇక ఈ స్తోత్రాలు, పురాణాల ఆధారంగా చిత్రకారులు, శిల్పులు దేవీ దేవతలని సంగీత వాయిద్యాలతో మలచడంతో ఇప్పటి తరానికి ముద్ర పడిపోయింది.
సంగీతం - కళ
సంగీతం ఒక శాస్త్రం గా ఆవిర్భవించాక, అది ఒక కళ గా మరో రూపం దాల్చింది. ఏ కళ అయినా మనిషికి అనుభూతిని కలిగించడమే దాని లక్ష్యం.
సంగీతం - కళగా పరిణామం
శృంగారం, సౌందర్యోపాసన అనే అనుభూతులకే అన్ని కళలు మొదట్లో ఉపయోగించబడేవి. వీటికే ఆదరణ, విలువ, పోషణ ఉండేవి. సంగీతాన్ని పాండిత్య ప్రకర్ష కోసం ప్రదర్శించడం, దాని ద్వారా సంపాదన పెంచుకోవడం అనేది చాలా ప్రబలంగా నడిచింది. అంతేకాక సంగీతాన్ని ఆకర్షణకి ఉపయోగించడం వల్ల అది ఒక అనాచారంగా, అగౌరవానికి చిహ్నంగా భావించడం మొదలైంది. ఇలా ఆడవారు క్రమంగా కళలకి దూరం అయిపోయారు.
సంగీతం - భక్తి movement
ఇలా ఉంటున్న సమయంలో దాదాపు 8వ శతాబ్దంలో నయనార్, ఆళ్వార్ ల ద్వారా భక్తి movement మొదలైంది. కళలని, ముఖ్యంగా సంగీత సాహిత్యాలని దైవ ఉపాసనకు ఉపయోగించడం అనేది వీరి ద్వారా మొదలయ్యి, ఒక పెను ఉప్పెనలా భారతదేశం అంతా వ్యాపించింది. ఉత్తర భారతదేశం లో కూడా ఎంతో మంది వాగ్గేయకారులు తమ భక్తి ని సంగీతం ద్వారా ప్రజలలోకి తీసుకువెళ్లారు.
సమాజం పై సంగీతం ప్రభావం
ఒక్క భక్తి మాత్రమే కాదు, అప్పట్లో సమాజం లో ఉన్న ఎన్నో అసమానతలని, అమానవీయ సంస్కృతులని సంగీత సాహిత్యాలతో ప్రశ్నించారు. భగవంతుడిని భక్తులకి దగ్గరగా చేర్చారు. దేవుడి దృష్టి లో అందరూ సమానమే అన్న నిజాన్ని నిర్భయంగా నిశ్చయంగా తెలియజేశారు. ఈ భక్త వాగ్గేయకారుల రచనలు సమాజంలో ఎంతో మార్పు ని, ప్రజలకి ఉరటని కలగజేశాయి.
భక్తి - శాస్త్రీయ సంగీతం
ఈ భక్తి ప్రభావం శాస్త్రీయ సంగీతం, కళా సంగీతం పై కూడా పడింది. అన్నమయ్య (14వ శతాబ్దం) వంటి తొలితరం వాగ్గేయకారులు, సాహిత్యకారులతో మొదలయ్యి సంగీత త్రిమూర్తుల (18వ శతాబ్దం) అవతరణతో శాస్త్రీయ సంగీతం దాదాపు పూర్తిగా భక్తిమయం అయిపొయింది.
జావళి, తిల్లాన, వర్ణం లాంటి శృంగార పూరిత ప్రక్రియలలో కూడా భక్తి చోటు చేసుకుంది.
సంగీతం - నాదోపాసన
ఇక సంగీతం కేవలం ఒక శాస్త్రం, లేదా ఒక కళ గానో మిగలలేదు, అది పూర్తిగా ఒక ఆధ్యాత్మిక ప్రక్రియగా, మోక్షానికి మార్గంగా ఆవిర్భవించింది. ఒక్క పాట - కొన్ని యజ్ఞాలు, కొన్ని జపాలు, కొన్ని హోమాలకి సమానం అనే భావన మొదలైంది. భగవంతుడిని అతి త్వరగా ప్రసన్నం చేసుకొనే మార్గాలలో సంగీతం మొట్టమొదటిది అని నమ్మకం ఏర్పడింది. ఇది సంగీతం అనేది ప్రకృతి లో ఉంది అనడానికి నిదర్శనం.
సంగీతం - విస్తరణ
భక్తి సంగీతం అనే 'genre' సంగీతం యొక్క గౌరవమర్యాదలని తిరిగి ప్రజలు గుర్తించేలా చేసింది. ఆ తరువాత విదేశీ ప్రభావాల వల్ల సంగీతం లో ఎన్నో కొత్త ఆలోచనలు, మార్పులు వచ్చాయి, వస్తున్నాయి.
మనిషి కి ఉండే వేల వేల భవనలలో భక్తి ఒకటి, అలాగే ప్రేమ, తిరుగుబాటు, ప్రేరణ, హాస్యం, బాధ ఇలా ఎన్నో భావాలకి సంబంధించిన సంగీత ప్రక్రియలు ఆవిర్భవించడం మొదలుపెట్టాయి. దేశదేశాల సంగీత రీతులు జనాదరణ కి నోచుకున్నాయి.
పర్షియా వంటి దేశాల నుండి ఘజల్ వంటి ప్రక్రియలు, western music నుంచి వయోలిన్ లాంటి వాయిద్యాలు, ఇలా అన్నీ కలిసి ఇప్పుడు సంగీతం ఒక విశ్వభాష గా మారిపోయింది.
సంగీతం - సంప్రదాయం
ప్రతి సంస్కృతికీ ఒక సంగీత రీతి ఉంటుంది. కాలాలు మారినా, తరాలు మారినా అది కాపాడబడుతూ ఉంటుంది. మన భారతీయ సంస్కృతికి కూడా అలాగే రెండు శాస్త్రీయ సాంప్రదాయ రీతులు ఉన్నాయి. ఉత్తర భారత దేశంలో హిందుస్తానీ గా, దక్షిణ భారత దేశంలో కర్ణాటక సంగీతం గా ఇవ్వి ప్రకాశిస్తున్నాయి.
కర్ణాటక సంగీతం - సంగీత త్రిమూర్తులు
శ్రీ త్యాగరాజ స్వామి, శ్రీ ముత్తుస్వామి దీక్షితులు, శ్రీ శ్యామశాస్త్రి - వీరు సంగీత త్రిమూర్తులు, సమకాలీకులు. వీరి రచనల వల్ల కర్ణాటక శాస్త్రీయ సంగీతం తన పరిపూర్ణతకి చేరుకుంది. రాగం, తాళం, సాహిత్యం, భావం, శాస్త్రీయత, జనాదరణ - వీటన్నింటిని పరిపుష్టంగా కలిగిన రచనలు చేశారు ఈ మూర్తి త్రయం.
శ్రీ త్యాగరాజస్వామి
మూడు వాక్యాల్లో వీరి సంగీతాన్ని వర్ణించాలంటే -
simple yet magnificent
classical yet innovative
mystical yet meaningful
శ్రీ రామచంద్ర మూర్తి వీరి నాయకుడు. రామాయణం ముఖ్య వస్తువు. ఇతర దేవీ దేవతలపై రచనలు చేసినా చివరికి తాను శ్రీ రామచంద్రుని ఉపాసకునిగానే చెప్పుకుంటారు.
ఎన్నో కొత్త రాగాలు, తాళ ప్రక్రియలని తమ కృతుల ద్వారా పరిచయం చేశారు. కర్ణాటక సంగీతం అంటే శ్రీ త్యాగరాజస్వామి కీర్తనే! భాషలో ఎంతో simple గా ఉంటూనే గొప్ప విశేషాలని చెప్పడం వీరి గొప్పదనం.
శ్రీ శ్యామశాస్త్రి
వీరి ప్రతి కృతి ఒక పూజ లాగ ఉంటుంది. అంటే 'శ్యామకృష్ణ సహోదరి' అంటూ అమ్మవారి ని తోబుట్టువుగా సంబోధిస్తునే, ఆర్తి, భక్తి, ఆర్ద్రత తో కూడిన రచనలు చేశారు. సమాజానికి జీవితానికి సంబంధించిన ఎటువంటి mentions వీరి కృతులలో కనిపించవు.
నిజంగా అమ్మవారి గర్భగుడి లో కూర్చుని ప్రపంచంతో ఎటువంటి సంబంధంలేని ఉపాసకుని గానమే శ్రీ శ్యామశాస్త్రి గారి రచనలు. చాలా intense గా ఉంటాయి. ఎంతో భక్తి తన్మయత్వం లో ఉంటే గాని ఈ రచనలని ఆస్వాదించడం కష్టం కానీ రాగ విస్తరణ, భావ ప్రకటన అద్భుతంగా ఉండి మనకి అమ్మవారిని సాక్షాత్కరింప చేస్తాయి.
శ్రీ ముత్తుస్వామి దీక్షితులు
త్రిమూర్తులలో చిన్నవారు వీరు. వీరి ఒక్కొక్క కృతి ఎన్నో layers లో ఉంటుంది - 'musical documentation' అని అనచ్చు వీరి రచనలని. ఒక దైవం, ఒక పుణ్యక్షేత్రం, ఒక వ్రతం - వీరి వస్తువులు - ఆ composition లో ఆ దైవం/పుణ్యక్షేత్రం/వ్రతం కి సంబంధించిన పూర్తి వివరాలు, ఆ కృతి రచించిన రాగం పేరు, తన ముద్ర అయిన 'గురుగుహ' ఇవన్నీ ఒక్క కృతి లో ఉంటాయి. ఇవ్వి కాక, మంత్ర తంత్ర ఉపాసనలకు సంబంధించిన ఎన్నో రహస్యాలు, మెళకువలు కృతుల ద్వారా విప్పి చెప్పేశారు శ్రీ ముత్తుస్వామి వారు.
అకల్మష శాస్త్రీయ సంగీత శైలి వీరిది. సంగీతం లో ఒక స్థాయికి చేరుకుంటే గాని వీరి రచనలు ప్రదర్శించడం కష్టం, అయితే తమాషా ఏంటంటే ఇలాంటి complex compositions చేసిన వీరే, నోటుస్వరాలు అని కొన్ని western band music influence తో రచనలు చేశారు.
కర్ణాటక సంగీతం - శక్తి ఉపాసన
కర్ణాటక సంగీతం లో అమ్మవారి గురించి, శ్రీవిద్య ఉపాసన గురించి ఎన్నో గొప్ప కృతులు ఉన్నాయి. సంగీత త్రిమూర్తులు గాక ఇంకా ఎంతో మంది దేవీ ఉపాసకులు గొప్ప కృతులని రచించారు.
ఈ సిరీస్ లో అలాంటి కొన్ని కృతులు, అలాంటి కొందరు వాగ్గేయకారులని తలచుకుందాం.
శక్తి ఉపాసన - మూలాలు, పరిణామక్రమం
పూర్వ కాలంలో శక్తి ఉపాసన తంత్ర మంత్ర ముద్రలతో కూడినదై ఉండేది. ఈ ఉపాసన భక్తి కంటే కూడా సిద్ధులకోసం మానవాతీత శక్తుల కోసం ఉపాసించేవారు.
ఇక గ్రామదేవతల ఉపాసన ఎప్పుడు జానపదులలో ఉన్నదే. గ్రామదేవతలు ప్రజలనుండే అమరులై దైవత్వాన్ని అందుకున్న కొంతమంది త్యాగశీలురైన స్త్రీలు, వారు శక్తి అంశలై ఆయా ప్రాంతాలని కాపాడుతూ ఉంటారు. అయితే వీరి ఆరాధన, పద్దతలు ఇతర దేవీ దేవతల పూజా ప్రక్రియలకంటే చాలా వేరుగా ఉంటాయి.
ఆదిశక్తిని ఉపాసించే పధ్ధతికి భక్తికి చాలా తక్కువ సంబంధం ఉండేది. ఎక్కువగా ఉపాసన, మంత్ర బలం, సాధనలతో కూడినదై ఉండేది.
ఆది శంకరులవారు ప్రవేశపెట్టిన సంప్రదాయాలు
8 వ శతాబ్దం లో శ్రీ ఆదిశంకరాచార్యుల వారు అమ్మవారి రౌద్ర తాంత్రిక రూపాలని కాక కరుణా వాత్సల్యాలతో నిండిన అమ్మవారిని సామాన్య భక్త జనాలకి పరిచయం చేశారు.
అమ్మవారిని రహస్య శక్తి స్వరూపిణిగానే కాక పర్వతరాజు గారాల కుమార్తెగా, పరమశివుని ఇల్లాలిగా, గణపతి కుమారస్వామూలకి తల్లిగా, లక్ష్మి సరస్వతులతో స్నేహంగా మెలిగే మృదుస్వభావురాలిగా వర్ణించి, అమ్మవారు కూడా తమలాగానే ఒక కూతురు, చెల్లెలు, భార్య, తల్లి అన్న ఆప్యాయత అందరి హృదయాలలో కలుగజేశారు.
సౌందర్యలహరి వంటి స్తోత్రాలలో అమ్మవారి ఉగ్ర తంత్ర రూపాలు కాకుండా మాతృస్వభావ ('approachable') అవతారాలని వర్ణించి, శిష్టాచారాలు, నిత్య పూజలు, సామాన్యులు కూడా అవలింబించగలిగే దేవీ ఆరాధనా విధులను ప్రవేశపెట్టారు. మఠాలని స్థాపించి, అమ్మవారి కరుణ కటాక్షాలు సామాన్యులుకూడా పొందగలరనే నమ్మకాన్ని కలగజేశారు.
సామాన్య భక్త గణానికి పరిచయం అయిన శక్తి ఆరాధన
అప్పటివరకు ఎంతో రహస్యంగా, గోప్యంగా, అతి క్లిష్టంగా ఉన్న అమ్మవారి ఉపాసన - స్తోత్రాలు, సహస్రనామ పరాయణలుగా మలచి simplify చేశారు.
ఆది శంకరుల శిష్యులు ఆ తరువాత కుంకుమ పూజలు, వ్రతాలు, పారాయణలు వంటి ప్రక్రియలలో స్త్రీలకు కూడా భాగం ఉండేలా పద్ధతులని ప్రవేశపెట్టారు.
సులభమైన పద్ధతులు, ఆచారాలు
అలాగే ఎన్నో మూలమూర్తులను, ఆలయాలను స్థాపించి, పునరుద్ధరించి, అమ్మవారి దర్శన, ఆరాధన ని సామాన్య ప్రజలకి అందుబాటులోకి తెచ్చారు. అప్పటినుంచి శక్తి ఉపాసన 'mainstream devotion' లోకి వచ్చి చేరింది. ఎవరికి తగ్గ ఆచారాలతో వారు అమ్మవారి పలు రూపాలని ఆరాధించడం, ఇలవేల్పుగా ఉపాసించడం మొదలుపెట్టారు. గుడికి వెళ్లి దర్శించుకుంటేనే చాలు అన్నంత సులభం అయింది శక్తి ఉపాసన.
శక్తి ఉపాసన - భక్తి - సంగీతం
అలా మంత్రాలకు తంత్రాలకు మాత్రమే పరిమితమై ఉన్న శక్తి ఉపాసన, అమ్మవారి పట్ల భక్తి గా మారి, స్తోత్రాలు, పారాయణలు, వ్రతాల రూపం లో జీవనస్రవంతి లో కలిసి, సంగీత సాహిత్యాలలో కూడా భాగం అయింది.
తెలుగులో
మన తెలుగు సంగీత చరిత్ర తోలి వాగేయకారుడైన అన్నమయ్యతో మొదలవుతుంది. శ్రీ త్యాగరాజస్వామి వారు కూడా అన్నమయ్య పాటలతోనే పెరిగారట. శైవ వైష్ణవ శాక్తేయ మతాలు అప్పట్లో చాలా ప్రబలంగా ఉండేవి.
'ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు
అంతరాంతరములెంచి చూడ పిండంతే నిప్పటి యన్నట్లు'
అన్న కీర్తన లో పిండి కొలది రొట్టె అన్నట్లు, ఎవరు నిన్ను ఎట్లా తలిస్తే నువ్వు అట్లాగే పలుకుతావు, ఉంటావు అని అర్థం - చరణం లో
"కొలుతురు మిము వైష్ణవులు, కూరిమితో విష్ణుడని
పలుకుదురు మిము వేదాంతులు, పరబ్రహ్మంబనుచు
తలతురు మిము శైవులు, తగిన భక్తులునూ శివుడనుచు
అలరి పొగడుదురు కాపాలికులు, ఆది భైరవుడనుచు
సరి మిమ్ముదురు శాక్తేయులు, శక్తి రూపు నీవనుచు
దరిశనములు మిము నానా విధులను, తలుపుల కొలదుల భజింతురు
సిరుల మిమునే అల్పబుద్ది, తలచినవారికి అల్పంబగుదవు
దరిమల మిమునే ఘనమని తలచిన, ఘనబుద్ధులకు ఘనుడవు"
వైష్ణవులకు విష్ణువు వి, శైవులకు శివుడివి, వేదాంతులకి పరబ్రహ్మవి, కాపాలికులకి ఆది భైరవుడివి, శక్తేయులకు శక్తి రూపానివి, అల్ప బుద్ధి కలవాళ్ళకి అల్పంగా, గొప్ప బుద్ధి గలవాళ్ళకి గొప్పగా తోస్తావు అని అప్పట్లోనే కీర్తనలో తేల్చేశారు అన్నమయ్య.
అన్నమయ్య కీర్తనలలో అమ్మవారు
అన్నమయ్య శృంగార రచనలలో మాత్రమే కాకుండా లక్ష్మి అమ్మవారు/అలమేలుమంగ/పద్మావతి అమ్మవారి వైభవాన్ని ఎన్నో కీర్తనలలో వర్ణించారు. బహుశా అమ్మవారి రూపాన్ని ఇంత అద్భుతంగా వర్ణించిన తొలి తెలుగు సంప్రదాయ లలిత శాస్త్రీయ సంకీర్తనలు ఇవ్వేనెమో.
పలుకుతేనెల తల్లి పవళించెను అనే కీర్తనలో ...
'కమలజుగన్న తల్లి కాముని కన్నతల్లి
అమరుల కన్నతల్లి ఆదిమలక్ష్మి'
బ్రహ్మ ని కన్న తల్లి, మన్మధుడిని కన్న తల్లి, దేవతల/అమరుల కన్న తల్లిగా లక్ష్మి దేవిని వర్ణించారు. అలాగే 'జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి' అనే సంకీర్తన చరణంలో
'చందురుతోడఁ బుట్టిన సంపదలమెఱుఁగవో
కందువ బ్రహ్మలఁ గాచేకల్పవల్లి
అందినగోవిందునికి అండనే తోడునీడవై
వుందానవు మాఇంటనే వుండవమ్మా'
'పాల సముద్రము చిలికినప్పుడు చంద్రుడి తోడ పుట్టి, జ్ఞానులని ఎల్లప్పుడూ కాపాడుతు, శ్రీ వేంకటేశ్వరునికి తోడు నీడై ఉండే అమ్మ, మా ఇంట్లో కూడా సిరిసంపదలని ఇస్తూ కొలువై ఉండు అని ప్రార్ధించారు.
ఇలా మొట్టమొదటిసారి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు సంకీర్తనల లో - లలిత శాస్త్రీయ సంగీతం ద్వారా భక్తులకు దగ్గరయ్యారు అని అనవచ్చు.
ఇలా మొట్టమొదటిసారి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు సంకీర్తనల లో - లలిత శాస్త్రీయ సంగీతం ద్వారా భక్తులకు దగ్గరయ్యారు అని అనవచ్చు.
ఇది కర్ణాటక సంగీతం లో శక్తి ఉపాసన మొదటి భాగం - వచ్చే భాగం లో మరిన్ని విశేషాలు, విశ్లేషణలు.
(సశేషం)
Comments