కర్ణాటక సంగీతం - శక్తి ఉపాసన (భాగం - 4)

కర్ణాటక సంగీతం - శక్తి ఉపాసన 
నాల్గవ భాగము

ఎవరీ సంగీత మూర్తిత్రయం? వీరే ఎందుకు?
కర్ణాటక సంగీతం శ్రీ త్యాగరాజు, శ్రీ శ్యామశాస్త్రి, శ్రీ ముత్తుస్వామి దీక్షితుల రచనలలో పరిపూర్ణతని సంతరించుకుంది అని సంగీత విశ్లేషకులు అంటారు.  రాగము, తాళము, సాహిత్యము లాంటి సాంకేతిక అంశాలు, సాత్విక, తాత్విక, సామజిక అంశాలతో నిండిన భావ పరిపుష్టత, అన్నిటిని మించి భగవద్భక్తి - అన్నింట్లోనూ ఈ ముగ్గురి రచనలు వాగ్గేయకార వైభవాన్ని చాటుతాయి.  రానున్న తరాలకి కర్ణాటక సంగీత నిధిని, పద్ధతిని, బోధనని, మార్గాన్ని చూపే ప్రకాశవంతమైన రచనలు వారివి.  

శ్రీ శ్యామశాస్త్రి - శక్తి ఉపాసన 
శ్రీ శ్యామశాస్త్రి గారు అమ్మవారి మీద తప్ప ఇంక ఎవరి మీదా రచనలు చెయ్యలేదు.  అందుకనే వీరి సంగీతం అంతా అమ్మవారి ఉపాసనే! 

మాకు కొన్నేళ్ల క్రితం ఒక అద్భుతమైన పుస్తకం లభించింది.  దాని పేరు శ్యామవాణి

1950 లో వెలువడిన గ్రంథం.  శ్యామశాస్త్రి గారి రచనలను తెలుగు సంగీత విద్యార్థులకు మరింత దగ్గర చేయాలనే ఉద్దేశ్యంతో ఈ గ్రంథాన్ని తీసుకురావడం జరిగింది.  అప్పట్లో విజయవాడ దుర్గామల్లేశ్వర దేవస్థానం వారు ఒక కమిటీ గా ఏర్పడి ప్రతి సంవత్సరం శ్యామశాస్త్రి గారి కృతుల పోటీలను నిర్వహించేవారు.  
విద్యార్థులలో శ్రీ శ్యామశాస్త్రి గారి రచనల పట్ల ఆసక్తి ని కలగజేయడానికి వారు ఈ కార్యక్రమాలని నిర్వహించేవారు.  ఈ గ్రంథము వెనకాల సంకల్పం, కృషి, ప్రయత్నం అంతా శ్రీ బేతపూడి వీర శరభయ్య మరియు శ్రీ పార్థసారథి గారి వి.




శ్యామవాణి పుస్తకం లో ఈ చిత్రాలు కనిపిస్తాయి.  మద్రాస్ మ్యూజిక్ అకాడమీ వారు అందించిన శ్యామశాస్త్రి గారి పటం, వారు ఆరాధించిన బంగారు కామాక్షి విగ్రహం, ఈ గ్రంథాన్ని మొత్తం ప్రింట్ కి తన చేతి వ్రాతతో  స్క్రిప్ట్ ని అందించి ప్రచురణ, ముద్రణ వ్యవహారాలన్నీ చూసుకున్న శ్రీ పార్థసారథి గారి చిత్రం.


శ్యామశాస్త్రి గారి రచనలు 
ఈ గ్రంథకర్తలు చేసిన రీసెర్చ్ ప్రకారం శ్రీ శ్యామశాస్త్రి గారు మొత్తం 300 వరుకు సంగీత రచనలు చేశారని తెలుస్తుంది.  అయితే ప్రచారం లో ఉన్నవి కేవలం 40 - 50 మాత్రమే.  ఈ గ్రంథంలో మొత్తం 44 రచనలని పొందుపరచారు.

ఎందుకు ఇలా రచనలు అందకుండా పోతాయి? అటు అన్నమయ్య వారు వ్రాసిన 36 వేల సంకీర్తనలతో కొన్ని వందలు మాత్రమే లభించాయి.  త్యాగరాజస్వామి 24,000 వరుకు రచించారని అందులో కేవలం 700 వరుకు రచనలు మాత్రమే లభిస్తున్నాయని అంటారు.

దీనికి శ్రీ బాలాంత్రపు రజినీకాంత రావు గారి 'ఆంధ్ర వాగ్గేయకార చరిత్ర' లో ఒక సమాధానం ఉంది.  ఒకటి - అన్ని వేల రచనలు కేవలం కల్పిత సంఖ్య అయిఉండవచ్చు.  రెండు - వాగ్గేయకారునికి తమ రచనలని నిల్వ చెయ్యాలనే తాపత్రయం లేకపోవడం.

శ్యామశాస్త్రి గారి జీవిత చరిత్ర వ్రాస్తూ ఈ గ్రంథకర్తలు కూడా అదే విషయం చర్చించారు.  శ్యామశాస్త్రి గారు వృత్తి రీత్యా అమ్మవారి అర్చకులు.  అంతకు మించి భక్తులు, ఉపాసకులు.  ఇంకా త్యాగరాజస్వామి వారికి చాలా పెద్ద శిష్య బృందము, ముత్తుస్వామి వారికి వారసులు, శిష్యులు ఉండి చాలావరకు రచనలని నేర్చుకోవడం, నొటేషన్ వ్రాసి పెట్టడం లాంటివి చేశారు.

శ్యామశాస్త్రి గారికి మొత్తం వారి కుమారునితో కలిపి అయిదుగురు వరుకు శిష్యులు.  అయితే శ్యామశాస్త్రి గారు వారి రచనలని త్యాగరాజస్వామి గారితో చర్చించే వారు, శిష్యులచేత ప్రదర్శింపజేసేవారు అని చెప్తారు.

శ్యామశాస్త్రి గారి కుమారులైన సుబ్బరాయ శాస్త్రి గారిని వారు శ్రీ త్యాగరాజస్వామి వారి వద్ద శిష్యునిగా పంపారు.  ఈ సంగీత త్రిమూర్తుల మైత్రి కూడా చాలా అపురూపమైనదని చరిత్రకారులు చెప్తారు.

శ్యామశాస్త్రి గారి రచనలు
వీరు స్వరజతి వ్రాసినా, కృతులు వ్రాసినా అన్నీ అమ్మవారే.

స్వరజతులు 
'కామాక్షి అనుదినము మరువకనే నీ పాదములే దిక్కనుచు నమ్మితిని'
అనే శరణాగతి రచనలో చరణాల వరుస 'స రి గ మ ప ద ని' స్వరాలతో మొదలవుతాయి. 
ఇందులో రెండో చరణం - 'కంబుగళ నీరదచికురా విదువదనా మాయమ్మ'  అంటే - శంఖం వంటి మెడ కలిగినదాన, ఒత్తైన నల్లటి మేఘాలు వంటి కురులు, ఆ మబ్బుల మధ్యన చందమామ లాంటి ముఖం కలదానవమ్మ, నిన్ను నమ్మి ఉన్నాను' అని అర్ధం.

వీరి రచనలన్నీ సౌందర్యలహరి తెలుగులో కృతుల రూపంలో వెలిసినట్లు ఉంటాయి.  అమ్మవారి రూపాన్ని రోజు 16 ఉపచారాలతో పూజిస్తూ, అర్చిస్తూ ఆ రూపాన్నే తన కృతులలో వర్ణించారు శ్యామశాస్త్రి గారు.

వీరి రచనలను విశ్లేషిస్తూ musicologists ఏమంటారంటే ఒక చిన్న బాలుడు తనని పట్టించుకొమ్మని, తనతో మాట్లాడమని ఎలాగైతే తన తల్లి దగ్గర మారాం చేస్తాడో ఆ విధంగా అమ్మవారిని 'శ్యామకృష్ణ సోదరి' అంటూనే తన మొరని, ఆర్తిని కృతులలో రంగరించారని అందుకే ఆ కృతులలో అంత తన్మయత్వం కనిపిస్తుందని వివరిస్తారు.

శ్యామశాస్త్రి గారు కూడా ఈ కృతి రచనలని ఒక పధ్ధతి ప్రకారమో లేదా ఒక నియమం ప్రకారమో చెయ్యలేదని, తాను ఆ భక్తి లో తాదాత్మ్యం చెందినప్పుడల్లా ఈ రచనలు పుట్టేవని చెప్తారు.

అలాగే యడుకులకాంభోజి రాగం లో మరో స్వరజతి అది కూడా 'కామాక్షి..' అంటూనే మొదలవుతుంది.

'కామాక్షి నీ పదయుగమే స్థిరమని నే నమ్మియున్నను నా చింతలన్నియు దీర్చమ్మా' అని పల్లవి.  11 చరణాలు ఉంటాయి.  ఈ కృతి స్వరరచన ఎంత సున్నితంగా ఉంటుందంటే అచ్చం మాట్లాడుతున్నట్టుగా అర్ధిస్తున్నట్టుగా ఉంటుంది.

నాకు చాలా ఇష్టమైన చరణం 'కుంద ముకుళ రదా, సురబృంద వినుత పదా, భువిలో వరదాయకి గద, నా మొరలు చెవులకు వినవ, గిరిసుత'

ఇంకా విరియని మల్లెమొగ్గల వంటి పలువరుస కలదానా, దేవతలందరు మొక్కేదాన, లోకంలో వరాలిచ్చే దానివని ప్రసిద్ధి చెందావు కదా, నా మొరలు నీ చెవులు వినేనా? అని అర్ధం.

అలాగే తోడి రాగంలో 'రావే హిమగిరి కుమారి, కంచి కామాక్షి, వరదా, మనవి వినవమ్మ, శుభమిమ్మ మాయమ్మ' అని పల్లవి.  ఇంతా చేసి వీరు అమ్మవారిని ఏం వరాలు కోరుకున్నారో మనకి తెలియదు, జీవితాంతం చాలా నిరాడంబరంగా బ్రతికారని, డబ్బుకోసం అస్సలు తాపత్రయపడేవారు కాదని చెప్తారు.  అందుకని వీరు వేడుకోలు అంతా మోక్షానికో, మనశ్శాంతి కో, కేవలం అమ్మవారి నుంచి అనుగ్రహానికో మాత్రమే అని అర్థం అవుతుంది.

ఆనందభైరవి రాగ ప్రీతి      
శ్యామశాస్త్రి గారి ఆనందభైరవి చాలా అద్భుతంగా ఉంటుంది.  పాడటానికి చాలా సామర్ధ్యం కావలి.  విళంబతాళ కృతులైతే చెప్పక్కర్లేదు.

ఓ జగదంబ! అనే కృతి ఎత్తుగడే 'ఓ ... ' అని పిలుస్తున్నట్టు ఉంటుంది అమ్మవారిని.  ఈ కృతికి 3 చరణాలు, ఒక స్వరసాహిత్యం ఉన్నాయి.  అయితే కచేరీలలో అన్ని చరణాలు పాడరు, బహుశా నిడివి వల్ల అయిఉండవచ్చు.

ఇదే రాగంలో 'మరివేరే గతి ఎవ్వరమ్మా మహిలో బ్రోచుటకు', సంస్కృతం లో 'పాహి శ్రీ గిరిరాజసుతే, కరుణా కలితే, పదసరోజ మను సరామితే' 'హిమాచల తనయ బ్రోచుటకిది మంచి సమయము రావే అంబ', అనే కృతులను రచించారు.

అయితే వీరి రచనలలో ఒక ఆనందభైరవి వర్ణం ఉంది - అట తాళం, పద వర్ణం అంటే ప్రతి చరణం/స్వరానికి సాహిత్యం ఉంటుందన్నమాట.  ఇది కంచి వరదరాజ స్వామి మీద వ్రాశారు శ్యామశాస్త్రి గారు.  ఈ వర్ణం సాహిత్యం వీర్ కృతులన్నిటికి భిన్నంగా ఉంటుంది. 

'సామిని రమ్మనవే ఈ వేళ సారసాక్షి - కామునిగన్న మా కంచివాసుడైన శ్రీ వరదరాజ సరసజేరి సమరతుల మేటి యుపరతుల జేసే నగ గరిమ మీరగను - ఘనత జేయుచును తలిరుబోణి - భళ! 

ఎంతవరకు నిజమో తెలియదుకాని శ్యామశాస్త్రి గారు త్యాగరాజస్వామి గారిని ఆనందభైరవి రాగం తనకు ప్రత్యేకంగా ఉండేలా, వారు రచనలు చేయవద్దని అడిగారని ఒక కథ విన్నాను.  అందుకే శ్రీ త్యాగరాజస్వామి గారి రచనలలో ఆనందభైరవి అంతగా కనపడదు అని అంటారు.

శ్యామశాస్త్రి గారి రచనల పట్టిక ఈ లింకు లో చూడచ్చు.

శ్రీ త్యాగరాజస్వామి వారి అమ్మవారి రచనలు నిజంగానే ఒక దర్శనానికి వెళ్లిన భక్తుని లాగ ఉంటాయి.  శ్రీ శ్యామశాస్త్రి గారి రచనలు పరాశక్తి ని అమ్మగా, చెల్లిగా హక్కుతో, చనువుతో సంబోధిస్తూ, విన్నపాలు చేసుకున్నట్టు ఉంటాయి.

తప్పకుండా వినాల్సిన కృతులు 
శ్యామశాస్త్రి గారి కృతులు సంగీత రచనలు అనేకంటే అనుభూతులు అని వర్ణించవచ్చు.  కొన్ని కృతులు ఎలా ఉంటాయంటే ఒక మానససరోవరం లో మునిగినట్టు, ఒక దివ్యమైన ఆధ్యాత్మిక అలౌకిక భావాలని మనలో కలుగజేస్తాయి.  అటువంటి తప్పక వినాల్సిన కృతులు

1.
మాయమ్మ - ఆహిరి  
(శ్రీరామ్ పరశురాం గారి వీడియో లింక్ - తమిళం, ఆంగ్లం లో చెప్పారు కొన్ని విశేషాలు)
మాయమ్మ కృతి (2)
('ఇండియన్ రాగా' అని ఒక సంస్థ వారు ఈ తరం శాస్త్రీయ సంగీత కళాకారులతో నిర్వహించే కార్యక్రమం - ఈ కృతి లలిత్ సుబ్రహ్మణ్యం పాడారు)

ఆహిరి ఒక చాలా క్లిష్టమైన రాగం.  అసలు దీన్ని స్వరాలలోకి అనువదించడం చాలా కష్టం.  ఆర్తిని నింపుకున్న రాగం ఇది.  ఈ రాగంలో 'మాయమ్మ అని నే పిలచితే మాట్లాడరాదా అంబ' అని పల్లవి, ఎంత ఆర్తి!

2.
నన్ను బ్రోవు లలిత - లలిత రాగం
(శ్రీ వోలేటి వెంకటేశ్వరులు గారు పాడిన లింకు)

నన్ను బ్రోవు లలిత (2)
(వాణి రామమూర్తి 'మద్రాసనా' అనే యూట్యూబ్ ఛానల్ లో భాగంగా వాణి రామమూర్తి ఆలపించారు)

లలిత రాగం లో 'నన్ను బ్రోవు లలిత వేగమే' అనే కృతి.  సాధారణంగా కృతిలో ఆ కృతి రాగాన్ని ప్రస్తావించడం శ్రీ ముత్తుస్వామి దీక్షితులవారి పధ్ధతి.  అది శ్రీ శ్యామశాస్త్రి గారు ఈ కృతిలో చేసిన విశేష ప్రయోగం.  ఎంతో ఆర్తి నిండి ఉన్న కృతి ఇది.

3.
సరి ఎవ్వరమ్మా - భైరవి
(శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారి రికార్డింగ్)

సరి ఎవ్వరమ్మా - భైరవి (2)
(శ్రీమతి ఎం.స్. షీలా గారి వీడియో)

భైరవి రాగం అంటేనే అమ్మవారి సంగీత స్వరూపం.  అలంటి భైరవి రాగంలో హెచ్చుస్థాయి లో మొదలయ్యే కృతి ఇది.  స్వరసాహిత్యం ఉంటుంది.  పూర్తిగా అమ్మవారి నామాలు అందంగా కూర్చబడిన సాహిత్యం.  ఈ కృతి భైరవి రాగంలో తేనెలాగ జాలువారే కృతి.  శ్యామశాస్త్రి గారి పాండిత్యం మనకి ఈ composition లో అర్థమవుతుంది.

శ్యామశాస్త్రి గారి రచనలన్నీ అమ్మవారిని గురించే! వీరు అర్చించే కామాక్షి దేవి మీద, క్షేత్ర దర్శనం చేసినప్పుడు మధుర మీనాక్షి నవరత్నాలు (7 మాత్రమే లభ్యం), తంజావూరు బృహన్నాయకి అమ్మవారి మీద, తిరువయ్యుర్ ధర్మసంవర్ధినీ దేవి మీద రచనలు చేశారు.

తెలుగు సంస్కృతం లో ఎక్కువ రచనలు చేసినా కొన్ని తమిళ రచనలు కూడా లభించాయి.

1
ఎన్నేరముమ్ ఉన్ నామం - పూర్వీకల్యాణి

2
ఎన్నెరముమ్ ఉన్ పాదకమల ధ్యానం - పున్నాగవరాళి

ఎందుకింత ఆర్తి? ఎందుకు ఇంత బాధ, ఇంత విరక్తి వీరి రచనలలో అన్నదానికి ఒక సమాధానంగా శోధగంగ అనే గ్రంథం లో ఒక చాలా ఆశ్చర్యకరమైన జీవిత విశేషం కనిపించింది.

శ్యామశాస్త్రి గారికి మీనాక్షి అని చెల్లెలు ఉండేదిట.  ఇద్దరు చాలా ఆప్యాయంగా ఉండేవారట.  వీరికి బంగారు కామాక్షి దేవి వచ్చినట్టే మీనాక్షి కి శ్రీ కృష్ణుని విగ్రహం ఒకటి తెచ్చి ఇచ్చారట.  అందుకే 'శ్యామకృష్ణ సోదరి' అనే ముద్ర వీరి రచనలలో కనిపిస్తుంది.

మీనాక్షి ప్రస్తావన వీరి ఇతర జీవిత చరిత్రలలో కనిపించకపోవడానికి ఒక కారణం ఉంది. మీనాక్షి కి భర్త పోవడం తో ఆమె అప్పటి ఆచారాల ప్రకారం సతీ  సహగమనం చేసింది.  ఇది శ్యామశాస్త్రి గారికి ఎంతో దుఃఖాన్ని కలిగించింది, ఇదంతా కూడా వారి కృతులలో ఆర్తిగా, వైరాగ్యంగా, విన్నపాలుగా పలికిందని ఈ గ్రంథం లో ఉంది.

శ్రీ శ్యామశాస్తి గారి జీవితచరిత్ర మరియు విశేషాలు (ఆంగ్లంలో)

వీరి కృతులు పాడటం చాలా కష్టమే కానీ ఆ రుచి తెలిసిన వారు ఆలపించినా, విన్నా ఆ అనుభూతే వేరు.

శ్యామాశాస్త్రి గారి జీవితం, సంగీతం అంతా కామాక్షి మయం.  అమ్మవారి అనుగ్రహం పొందడమే వీరి ధ్యేయం.  ఇతర లౌకిక విషయాల ప్రస్తావన కానీ ఆసక్తి కానీ ఎక్కడ కనిపించదు.

కర్ణాటక సంగీతం లో వీరి రచనలు పరిపూర్ణంగా శక్తి ఉపాసన కలిగి ఉండి రాబోయే తరం వాగ్గేయకారులకు ఆదర్శంగా నిలిచాయి.

అయితే ఇవి పూర్తిగా భక్తి భావనా రచనలు. వచ్చే భాగం లో మంత్ర తంత్ర సహిత శక్తి ఉపాసన కర్ణాటక సంగీతం లోకి శ్రీ ముత్తుస్వామి దీక్షితుల వారు అందించిన విధానం గురించి చర్చ.

ఇట్లు
సుష్మ
సాపాసా    

Comments